తొందరేం లేదు..!
Published Mon, Jan 27 2014 10:40 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి తమ మద్దతు ఉపసంహరించుకునే విషయంలో తొందరపడబోమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే ఆ పార్టీ పాలనాతీరుపై అసంతృప్తిగానే ఉన్నామని తెలిపింది. సోమ్‌నాథ్ భారతి వ్యవహారం, రాష్ట్రపతి తన గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఆ పార్టీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పైవిధంగా స్పందించింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ముకుల్ వాస్నిక్ మాట్లాడుతూ.. ‘ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఉపసంహరణ విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మద్దతు పలికి రేపు ఉపసంహరించుకునే తొందర మాకు లేదు. అయితే ఆప్ ఆగడాలను చిన్న విషయాలుగా కొట్టిపారేయలేం. దేన్నీ తేలికగా తీసుకోం. అదే సమయంలో సహనంతో వ్యవహరిస్తామ’న్నారు.
ఢిల్లీలో రాజకీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీ క్షణక్షణం గమనిస్తూనే ఉందని, వాటిని సరిదిద్దుకునేందుకు ఆ పార్టీకి తాము ఎటువంటి డెడ్‌లైన్‌ను కూడా విధించడంలేదన్నారు. ఎన్నికల భారాన్ని ప్రజలపై మరోమారు మోపకుండా ఉండేందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి తాము మద్దతునిచ్చామని, ఆ పార్టీ ఏది చేసినా చూస్తూ ఊరుకుంటామనుకోవడం సరికాదన్నారు. ఇక బిన్నీ వివాదం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు వాస్నిక్ సమాధానమిస్తూ... ఆ వివాదం గురించి తాను మాట్లాడడం సరికాదన్నారు. అయితే బిన్నీ డిమాండ్లలో ఒకటైన సోమ్‌నాథ్‌ను తొలగించాలన్న వాదనకు తాము కూడా మద్దతు పలుకుతామన్నారు. రాష్ట్రపతి వ్యాఖ్యలను తప్పుబట్టేటంత సాహసం చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో సోమ్‌నాథ్ వైఖరిని తాము ఖండిస్తున్నామని చెప్పారు.
బిన్నీ లేవనెత్తిన అంశాలు తీవ్రమైనవే...
ఇదిలా ఉండగా ఆప్ పాలనపై బీజేపీ నేతలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. వినోద్‌కుమార్ బిన్నీ ఆప్ పాలనపై, ఆ పార్టీ నేతలపై లేవనెత్తిన అంశాలు తీవ్రమైనవేనని, వాటిని కొట్టి పారేయడానికి వీలు లేదని, వాటిపై ఆప్ ఆత్మ విమర్శ చేసుకోవాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. బిన్నీ ప్రశ్నలకు ఆప్ నేతలు సమాధానం ఇవ్వాల్సిందేనని, ప్రజలు కూడా ఆప్ ఏం సమాధానమిస్తుందోనని ఎదురు చూస్తున్నారన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెంటనే స్పందించాలని తాము కోరుతున్నామన్నారు. బాధ్యతాయుతమైన పదవి లో ఉన్న ఆయన ప్రజలకు జవాబుదారిగా ఉండా ల్సిన అవసరముందన్నారు.
Advertisement
Advertisement