వినోద్ కుమార్ బిన్నీ
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ బహిష్కృత నేత వినోద్ కుమార్ బిన్నీ ప్రకటించారు. బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజిబ్ జంగ్ను కలసి బిన్నీ ఆ విషయాన్ని వెల్లడించారు. అనంతరం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిన్నీ మాట్లాడుతూ... తాను డిమాండ్లు చేసి 48 గంటలు గడిచిన ఆప్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు సరైన స్పందన రాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వానికి 'గంట' కొట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు.
హస్తిన వాసులకు విద్యుత్ ఛార్జీలపై 68 శాతం సర్ ఛార్జీ తగ్గించాలని, ఎటువంటి కండిషన్ లేకుండా ఒకొక్క కుటుంబానికి ప్రతిరోజు 7 గంటల నీరు అందించాలి అలాగే ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా 'ఆప్'లో అవినీతికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బిన్నీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే బిన్నీ డిమాండ్ల పట్ల 'ఆప్' నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించింది. దీంతో ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
గతేడాది చివరలో న్యూఢిల్లీ శాసన సభకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 70 సీట్లలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 28 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ 32 సీట్లలో విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ మాత్రం 7 సీట్లు మాత్రమే గెలిచింది. దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బీజేపీని ఆహ్వానించారు. తాము ప్రతిపక్షానికి పరిమితం అవుతామని నజీబ్కు విన్నవించింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటు చేయాలని నజీబ్ జంగ్ 'ఆప్'ను కోరారు. దాంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.