ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఒకనాటి సహచరుడే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఒకనాటి సహచరుడే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు. ఆప్ బహిష్కృత నేత, లక్ష్మీనగర్ శాసనసభ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ వచ్చే ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని బిన్నీ మీడియాకు వెల్లడించారు. ‘ బిన్నీ బండారం బయటపెట్టడమే నా లక్ష్యం. ఇందులోభాగంగా ఆప్‌కు చెందిన అనేకమంది నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నా. ఢిల్లీవాసులను కేజ్రీవాల్ వంచించాడు. విద్యుత్ చార్జీలను తగ్గించలేదు. ప్రజలకు మంచినీరు ఉచితంగా అందలేదు. జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో ఆ పార్టీ చేసిందేమీ లేదు’అని అన్నారు.
బీజేపీలోకి బిన్నీ
ఇదిలాఉండగా ఆప్ బహిష్కృత నేత, లక్ష్మీనగర్ శాసనసభ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ... బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు, ఉచిత మంచినీరు, జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో బీజేపీ వైఖరేమిటనేది తెలుసుకున్నాకే ఓ నిర్ణయానికొస్తానన్నారు. వచ్చేవారం తన భావి కార్యాచరణను మీడియాకు వెల్లడిస్తానన్నారు.