బిన్నీ నిరాహార దీక్ష...సాయంత్రానికే ముగింపు
Published Mon, Jan 27 2014 10:46 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
ఆప్ అక్రమాలకు పాల్పడుతోందని, ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడం లేదని పేర్కొంటూ ఉదయం నిరాహార దీక్షకు దిగిన బహిష్కృత ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ కేవలం సాయంత్రం 3.30 గంటలకే దీక్ష విరమించారు. లెఫ్టినెంట్ గవర్నర్, అన్నా హజారే సలహా మేరకు తన నిరశనను ముగించినట్లు వివరణ ఇచ్చారు.
సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం ఎలాగైనా పడిపోవాలని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) కోరుకుంటోందని ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ ఆరోపించారు. ఆప్ సర్కారుకు వ్యతిరేకంగా సోమవారం ఆయన జంతర్‌మంతర్‌లో కొద్దిసేపు నిరాహార దీక్ష చేశారు. తాను దీక్ష జరపడానికి కేజ్రీవాలే కారణమని ఆయన ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరచ్చడం లేదని ఆరోపించారు. లక్ష్మీనగర్ ఎమ్మెల్యే అయిన బిన్నీ నాలుగు గంటలపాటు మాత్రమే దీక్ష చేసి విరమించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఆప్ సర్కారుకు పది రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించి ఈ నిర్ణయం వెలువరించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్భాటంగా నిరాహార దీక్ష ప్రారంభించిన ఆయన 3.30 గంటలకు దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు.
‘హామీలను నెరవేర్చడానికి కేజ్రీవాల్ సర్కారుకు 10 రోజులు గడువు ఇస్తున్నా. పది రోజుల్లో హామీలు నెరవేర్చకుంటే దేశవ్యాప్త ఆందోళన ఆరంభిస్తాను’ అని హెచ్చరించారు. లెఫ్టినెంట్ గవర్నర్, అన్నాహజారే సలహా మేరకు తన నిరసన ప్రదర్శనను ముగించినట్లు బిన్నీ చెప్పారు. ‘నాలుగైదు రోజులు నిరాహార దీక్ష జరపడం వల్ల ప్రయోజనం లేదని అన్నా చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని సూచించారు’ అని బిన్నీ తెలిపారు. నిరాహార దీక్ష ప్రారంభించడానికి ముందుగా ఆయన లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసి న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతిపై చర్య తీసుకోవాలని కోరారు. రాజ్‌ఘట్‌ను సందర్శించి మహాత్ముని సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించి నిరాహార దీక్ష మొదలుపెట్టారు.
పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలను బెదిరించడానికే ఆప్ తనను బహిష్కరించిందని ఆయన ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేల్లో పలువురు అసంతృప్తితో ఉన్నారని, వారు తనకు మద్దతు ఇస్తున్నారని బిన్నీ చెప్పారు. తనను పార్టీ నుంచి తొల గించ డానికి ముందు కేజ్రీవాల్ ప్రజాభిప్రాయసేకరణ జరిపించి ఉండాల్సిందన్నారు. ‘తాము చేసిన శుష్కహామీలను నెరవేర్చలేం కాబట్టి ఆప్ నాయకులు ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నారు. నేను వారిని అలా తప్పించుకోనివ్వను. పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ నేను అంశాల వారీగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తాను’ అని అన్నారు.
బీన్నీ వ్యాఖ్యలపై స్పందించిన కేజ్రీవాల్
సర్కారు నడపడం నుంచి తప్పించుకోవాలని ఆప్ ప్రయత్నిస్తోందంటూ బిన్నీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిస్పందిస్తూ ‘ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేం ఇక్కడ లేం. ప్రజలకు సేవచేయడానికి వచ్చాం’ అని వ్యాఖ్యానించారు. నెల రోజులలో తాము చేసినంత పని ఏ సర్కారూ చేయలేదని ఆయన చెప్పారు. తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మేల్యే వినోద్‌కుమార్ బిన్నీని ఆప్ క్రమశిక్షణా కమిటీ పార్టీ నుంచి తొల గిస్తున్నట్టు ఆప్ ఆదివారం ప్రకటించింది. బిన్నీని తొలగించడం తమకు అత్యంత బాధాకరంగా ఉందని, అయితే వేరే ప్రత్యామ్నాయం మిగలలేదని పార్టీ నేత యోగేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు.
బిన్నీ జరిపిన నిరాహారదీక్షలో ఆయన మద్దతుదారులు ‘అంజాన్ ఆద్మీ’ అని రాసి ఉన్న నల్లటోపీలు ధరించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వీరంతా ‘ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్’ టోపీలు, జాతీయ జెండాలు ధరించి కనిపించారు. ఇటీవలే బీజేపీని ఆప్‌లో చేరిన టీనాశర్మ కూడా వేదికపై కూర్చున్నారు. ఆప్‌లో ప్రజాస్వామ్యం లేదని టీనా శర్మ ఆరోపించారు. ‘ఆప్ ఒక్కరికీ ఒక్కోరకం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పార్టీ ఢిల్లీ ప్రజలను మోసగించింది. నగరవాసులు ఈ విషయాన్ని గుర్తించాలని మేం కోరుతున్నాం’ అని ఆమె చెప్పారు. ఆప్‌లో కొనసాగాలంటే నోరు మూసుకుని ఉండాలని ఆయన మద్దతుదారులు ఆరోపించారు. బిన్నీ ఆప్ సర్కారును విమర్శిస్తూ ‘ప్రభుత్వం ఢిల్లీ మహిళా కమిషన్ వంటి సంస్థలను అవమానిస్తోం ది.
దాదాపు 50 మంది బిన్నీ దీక్షలో పాల్గొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, అవినీతిపరులుగా పేర్కొన్న షీలాదీక్షిత్, ఇతర నేతలపై ఇంతవరకు ఎలాంటి చర్యా చేపట్టలేదు’ అని ఆయన విమర్శించారు. ‘ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా మహిళా కమెండో బలగాన్ని ఇంతవరకు ఏర్పాటుచేయకుండా మహిళల భద్రతతో చెలగాటమాడుతోందని అన్నారు. విద్యుత్తు, నీరు, జన్‌లోక్‌పాల్ బిల్లుల విషయంలో కూడా హామీలను నిలబెట్టుకోలేదు’ అని వినోద్‌కుమార్ బిన్నీ ఆరోపించారు.
Advertisement