బిన్నీ తిరుగుబాటు బావుటా!
Published Mon, Jan 27 2014 12:14 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్నికల వాగ్దానాలను గడువులోపే నెరవేర్చాలనే డిమాండ్ నేటి నుంచి తాను నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ఈ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ ప్రకటించారు. ఆప్ ప్రజలను పట్టించుకోవడం లేదని, లోక్‌సభ ఎన్నికలపైనే కేజ్రీవాల్ దృష్టి సారించారని ఆరోపించారు.న్యూఢిల్లీ: పార్టీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదని భావిస్తున్న తిరుగుబాటు ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ సొంతపార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్నికల వాగ్ధానాలను నెరవేర్చడం లేదని, అందుకే తాను సోమవారం నుంచి నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. ‘ఎన్నికల హామీల్లో ఏ ఒక్క దానినీ నెరవేర్చడానికి ఆప్ సిద్ధంగా లేదు.
ఫలానా గడువులోపు వాగ్దానాలను నెరవేర్చుతామని హామీ ఇచ్చాం కాబట్టి ఆ పని చేసి చూపించాలి. నా డిమాండ్లు నెరవేరే దాకా నిరాహార దీక్షను కొనసాగిస్తాను’ అని బిన్నీ అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కు ఫిర్యాదు చేసిన తరువాతే దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు. తన పోరాటానికి మద్దతు కూడగట్టుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణప్రాంతాల్లో పర్యటిస్తానని కూడా అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే మంత్రి సోమ్‌నాథ్ భారతి ఆఫ్రికా యువతపై దాడి చేయడం, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రైల్‌భవన్ ఎదుట ధర్నా చేయడం వంటి గిమ్మక్కులకు పాల్పడుతున్నారని లక్ష్మీనగర్ ఎమ్మెల్యే అయిన బిన్నీ ఆరోపించారు. ‘వాళ్లు ప్రజల కోసం పనిచేయడం లేదు. లోక్‌సభ ఎన్నికలపైనే ఆప్ దృష్టంతా. ఎన్నికల ప్రవర్తన నియమావళి అందుబాటులోకి వస్తే పనులన్నింటినీ నిలిపివేద్దామని అనుకుంటున్నారు’ అని విమర్శించారు. పార్టీ నాయకత్వంపై ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ ఆప్‌కు రాజీనామా చేయబోనని బిన్నీ స్పష్టం చేశారు. ‘ఆప్ ఒక వ్యక్తి పార్టీ కాదు. అది ఈ స్థాయికి రావడానికి నేను ఎంతగానో శ్రమించాను. నేనెందుకు రాజీనామా చేయాలి ?’ అని ప్రశ్నించారు.
ఇంతకుముందు కాంగ్రెస్‌లో పనిచేసిన బిన్నీ.. గత ఏడాదిలో ఆప్‌లో చేరి లక్ష్మీనగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తాను చేస్తున్న ఆరోపణలను పార్టీలో చాలా మంది సమర్థిస్తున్నా.. ఏ ఒక్క నాయకుడూ బహిరంగంగా తనకు మద్దతు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమ్‌నాథ్ భారతి వివాదం, ఆప్ పోలీసులపై తీవ్రవిమర్శలు చేయడంపై మాట్లాడుతూ ‘మా నాయకుల ప్రకటనలు, చర్యల్లో అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అందరినీ ఒకే దృష్టితో చూడకూడదు. భారతి రాజీనామా చేసి ఉండాల్సింది. మంత్రిస్థాయి వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సరికాదు’ అని విమర్శించారు. ఖిడ్కీ ప్రాంతంలోని ఆఫ్రికా యువతపై మంత్రి, ఆయన అనుచరులు ఇటీవల దాడి చేశారు. ఉగాండా మహిళల నుంచి వీళ్లు మూత్రం నమూనాలను సేకరించినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. ఉచిత మంచినీరు, కరెంటు సరఫరాపై విధించిన ఆంక్షలను రద్దు చేయడం, ఆప్ ఉద్యమాలకు మద్దతుగా లేఖలు ఇచ్చిన వారి బిల్లులను మాఫీ చేయడం వంటి డిమాండ్లతో దీక్షకు దిగుతున్నానని బిన్నీ చెబుతున్నారు.
Advertisement