జంతర్మంతర్ వద్ద బిన్నీ నిరాహార దీక్ష
ఢిల్లీలో కొత్తగా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఢిల్లీ సర్కారు అమలు చేయట్లేదంటూ ఆయన ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆదివారం నాడు బిన్నీని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ గురించి, పార్టీ నాయకత్వం గురించి బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేసినందుకు ఆయన్ను బహిష్కరించారు. దీంతో ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ను కలిసిన తర్వాత, దేశ రాజధాని నడిబొడ్డునున్న జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకుముందు ఆయన రాజ్ఘాట్కు వెళ్లి, బాపూజీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.
''నన్ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు మీడియా ద్వారా మాత్రమే తెలిసింది. నాకు మాత్రం ఇంతవరకు ఈ మెయిల్ ద్వారా గానీ, లేఖ ద్వారా గానీ ఎలాంటి సమాచారం అందలేదు'' అని బిన్నీ విలేకరులతో అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో షీలా దీక్షిత్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఏకే వాలియాను తూర్పు ఢిల్లీలోని లక్ష్మీనగర్ నియోజకవర్గంలో ఓడించిన వినోద్ కుమార్ బిన్నీ.. ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయ అనుభవం ఉన్న ఏకైక నాయకుడు. గతంలో ఆయన ఢిల్లీలో కార్పొరేటర్గా పనిచేశారు. అయితే.. ఆయనకు మంత్రి పదవిని మాత్రం కేజ్రీవాల్ ఇవ్వలేదు. అప్పుడే అలిగిన బిన్నీ, సంచలనాత్మక విషయాలు బయటపెడతానని బెదిరించడంతో పార్టీలో మంచి పదవి ఇస్తామని చెప్పి అప్పట్లో బుజ్జగించారు. దాంతో ప్రమాణ స్వీకారం నాటికి మాత్రం ఎలాగోలా నెమ్మదించారు. కానీ ఇన్ని రోజులు గడిచినా ఎలాంటి పదవి రాకపోవడంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదంటూ బిన్నీ మండిపడ్డారు. విద్యుత్ బిల్లులు తగ్గించడంలేదని, మహిళలకు భద్రత కల్పించడంలేదని, డెన్మార్క్ మహిళ అత్యాచారానికి గురైనప్పుడు సరిగా స్పందించలేదని ఆయన అన్నారు. దాంతో పాటు.. కేజ్రీవాల్ మీద కూడా ఆయన పలు ఆరోపణలు గుప్పించారు. పదేపదే ఇలాగే చేస్తుండటంతో ఆగ్రహానికి గురైన పార్టీ అగ్రనాయకత్వం, బిన్నీని నేరుగా పార్టీ నుంచి బహిష్కరించింది.