దీక్షను విరమించిన బహిష్కృత ఎమ్మెల్యే కుమార్ బిన్నీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరాహారదీక్షను విరమించుకుంటున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే కుమార్ బిన్నీ తెలిపారు. దీక్షకు దిగిన కొద్ది గంటల్లోనే బిన్నీ దీక్షకు విరామం ఇచ్చారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ అమలు పరచడంలేదంటూ బిన్నీ విమర్శించి దీక్షకు పూనుకున్నారు. తాము చేస్తున్న డిమాండ్ ల పై 10 రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సమాధానం చెప్పలేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తానని కుమార్ బిన్నీ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
ఆమ్ ఆద్మీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆదివారం నాడు బిన్నీని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ గురించి, పార్టీ నాయకత్వం గురించి బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేసినందుకు ఆయన్ను బహిష్కరించారు. దీంతో ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ను కలిసిన తర్వాత, దేశ రాజధాని నడిబొడ్డునున్న జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకుముందు ఆయన రాజ్ఘాట్కు వెళ్లి, బాపూజీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.