Womens Association leader
-
సీఎం సభకు రావాలని బెదిరింపులు
-
సీఎం మీటింగ్‌కు రాకపోతే రూ.400 కట్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యే సభకు రాకపోతే రూ.400 కట్ చేస్తామని డ్వాక్రా మహిళా సంఘం లీడర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీఎం బుధవారం అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా రాప్తాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు డ్వాక్రా మహిళలను తరలించే ఏర్పాట్లు చేశారు. సంఘం నుంచి కనీసం ఇద్దరు రావాలని ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తున్నారు. రాలేమని చెబుతుంటే బెదిరింపులకు దిగుతున్నారు. అనంతపురం: సీఎం చంద్రబాబు హాజరయ్యే సభకు రాకపోతే రూ.400 కట్ చేస్తామని డ్వాక్రా మహిళా సంఘం లీడర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీఎం బుధవారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పేరూరుకు వస్తున్నారు. బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల సభ్యులను తరలించేందుకు అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. ప్రతి మహిళా సంఘం నుంచి కనీసం ఒకరిద్దరు కచ్చితంగా రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. రామంటే బెదిరింపులకు దిగుతున్నారు. సోమవారం అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఓ సంఘం లీడరుకు యానిమేటర్ ఫోన్ చేశారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది. గ్రూపు లీడరు (అంజనాదేవి): అక్కా చెప్పక్కా! యానిమేటర్ (లక్ష్మీదేవి): అక్కా..పేరూరు మీటింగ్‌కు రావాలి గ్రూపు లీడరు: అక్కా మేము రాము. మేము వైఎస్సార్ పార్టీవాళ్లము. యానిమేటరు: మీ గ్రూపులో నుంచి ఎవరైన్నా పంపు. నువ్వే రావాలని చెప్పడం లేదు. గ్రూపు లీడరు: నేనైతే ఎవరికీ చెప్పను. రూలేమైనా ఉంటే చెప్పండి. నేను ఫాలో అవుతా. యానిమేటరు: నువ్వ లీడరు కాబట్టి చెబుతున్నా. ఎవర్నైనా పంపు. గ్రూపు లీడరు: నేనైతే ఎవరికీ వెళ్లమని చెప్పను. నేనైతే పక్కా వైఎస్సార్. పదిలక్షలు ఇస్తామంటే కూడా మీటింగ్‌కు రాను. యానిమేటరు: అవన్నీ అనవసరం. వస్తావా రావా? మనకు రాజకీయాలు అవసరం లేదక్కా? గ్రూపు లీడరు: మీటింగ్ పెడుతున్నారు కాబట్టి ఇది రాజకీయమే. రాజకీయ నాయకుల కోసమే పేరూరుకు పోతుండేది తెలుసు. యానిమేటరు: రాజకీయం కాదు మన డ్వాక్రా వాళ్ల కోసమే సారు బస్సు పంపిస్తున్నాడు. గ్రూపు లీడరు: సారు నంబరు నాకివ్వు. నేను ప్రెస్వాళ్లను పిలిపించి మాట్లాడతా. ఏళ్ల నుంచి గ్రూపులో ఉన్నా రుణమాఫీ కాలేదు. అవన్నీ తీర్చితే ఎన్ని బస్సులకు కావాలంటే అంతమందిని ఎక్కిస్తానని చెబుతా. యానిమేటరు: నువ్వు వస్తేరా లేదంటే లేదు.రాకపోతే రూ.400 కట్ చేస్తా. గ్రూపు లీడరు: మీటింగ్‌కు పోకపోతే సంఘంలో 400 కట్ చేస్తారా? సరే చేయండి. -
ఎన్నికల హామీ నెరవేర్చు బాబు
పార్వతీపురం : ఎన్నికల హామీని తక్షణమే నెరవేర్చాలని అఖిల భారత రైతు కూలీ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం నాయకుడు పోల ఈశ్వరరావు, ఎం.పూర్ణచంద్రరావు, పి.రమణి డిమాండ్ చేశారు. రైతు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ కోరుతూ గురువారం స్థానిక సబ్-కలెక్టర్ కార్యాలం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి కమిటీలు, కాలయాపన, కోతలు, కుదింపులు, పరిమితులు, రీ-షెడ్యూల్‌కు తావు లేకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి, టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు లేనిపోని హామీలిచ్చి గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆయా హామీలను నెరవేర్చే క్రమంలో మీనమేషాలు లెక్కిస్తూ... లేనిపోని ఆంక్షలు విధిస్తోందన్నారు. బేషరతుగా రుణాలను మాఫీ చేయకుండా కమిటీల పేరుతో తాత్సారం చేసి చివరికి రైతు కుటుంబంలో ఒకరికి మాత్రమే లక్షన్నర రూపాయలు వరకు మాఫీ చేస్తామని, అలాగే డ్వాక్రా మహిళా సంఘాలకు ఒక్కో సంఘానికి లక్ష రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో రైతాంగం ఈ సీజన్‌కి పంటల పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేతి వృత్తుల వారి అన్నిరకాల రుణాలను రద్దు చేస్తామని, అన్నిరకాల పింఛన్లు పెంచుతామని, చదువుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం హామీలపై ఇప్పటి వరకు ఎటువంటి ఊసే లేదన్నారు. ఎన్సీఎస్ బకాయిలు చెల్లించాలని, ఆర్.వెంకంపేటలో సాగు చేస్తున్న బంజరు భూములకు పట్టాలు ఇవ్వాలనికోరారు. అనంతరం సబ్-కలెక్టర్ కార్యాలయం ఏఓ రామారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. అంతకుముందు బెలగాంలోని సుందరయ్య భవన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా సబ్-కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు వి.కృష్ణ, జి.సర్వేశ్వర్రావులతో పాటు పలువురు మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.