ఎన్నికల హామీ నెరవేర్చు బాబు | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

ఎన్నికల హామీ నెరవేర్చు బాబు

Published Fri, Sep 5 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

ఎన్నికల హామీ నెరవేర్చు బాబు

ఎన్నికల హామీ నెరవేర్చు బాబు

పార్వతీపురం : ఎన్నికల హామీని తక్షణమే నెరవేర్చాలని అఖిల భారత రైతు కూలీ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం నాయకుడు పోల ఈశ్వరరావు, ఎం.పూర్ణచంద్రరావు, పి.రమణి  డిమాండ్ చేశారు. రైతు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ కోరుతూ గురువారం స్థానిక సబ్-కలెక్టర్ కార్యాలం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి కమిటీలు, కాలయాపన, కోతలు, కుదింపులు, పరిమితులు, రీ-షెడ్యూల్‌కు తావు లేకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి, టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
 ఎన్నికల ముందు లేనిపోని హామీలిచ్చి గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆయా హామీలను నెరవేర్చే క్రమంలో మీనమేషాలు లెక్కిస్తూ... లేనిపోని ఆంక్షలు విధిస్తోందన్నారు. బేషరతుగా రుణాలను మాఫీ చేయకుండా కమిటీల పేరుతో తాత్సారం చేసి చివరికి రైతు కుటుంబంలో ఒకరికి మాత్రమే లక్షన్నర రూపాయలు వరకు మాఫీ చేస్తామని, అలాగే డ్వాక్రా మహిళా సంఘాలకు ఒక్కో సంఘానికి లక్ష రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో రైతాంగం ఈ సీజన్‌కి పంటల పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
 
 చేతి వృత్తుల వారి అన్నిరకాల రుణాలను రద్దు చేస్తామని, అన్నిరకాల పింఛన్లు పెంచుతామని, చదువుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం హామీలపై ఇప్పటి వరకు ఎటువంటి ఊసే లేదన్నారు. ఎన్‌సీఎస్ బకాయిలు చెల్లించాలని, ఆర్.వెంకంపేటలో సాగు చేస్తున్న బంజరు భూములకు పట్టాలు ఇవ్వాలనికోరారు. అనంతరం సబ్-కలెక్టర్ కార్యాలయం ఏఓ రామారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. అంతకుముందు బెలగాంలోని సుందరయ్య భవన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా సబ్-కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఆ సంఘ నాయకులు వి.కృష్ణ, జి.సర్వేశ్వర్రావులతో పాటు పలువురు మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement