yalal
-
హాజీపూర్ సర్పంచ్ కిడ్నాప్‌కు యత్నం
యాలాల: మండల పరిధిలోని హాజీపూర్ సర్పంచ్ ఒంగోనిబాయి శ్రీనివాస్‌ను నలుగురు వ్యక్తులు అపహరించే యత్నం చేశారు. భయాందోళనకు గురైన ఆయన కేకలు వేయడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. ఆర్థిక వ్యవహారం నేపథ్యంలో ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. హాజీపూర్ సర్పంచ్ శ్రీనివాస్ తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన తుప్పుడు సంతోష్ వద్ద గతేడాది రూ.2.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. రూ.1.50 లక్షలు తిరిగి ఇవ్వగా మిగతా డబ్బుల కోసం శ్రీనివాస్‌ను సంతోష్ వేధించసాగాడు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న టీకొట్టులో ఉన్న సర్పంచ్ శ్రీనివాస్‌ను తుప్పుడు సంతోష్‌తో పాటు సాయిలు, శ్రీనివాస్, సునీల్ కలిసి క్రూజర్ (కేఏ 32 ఎం 7563) వాహనంలో వచ్చి బలవంతంగా ఆయనను అందులోకి ఎక్కించుకొని లక్ష్మీనారాయణపూర్ వైపు వెళ్లిపోయారు. ఈ హఠాత్మరిణామంతో ఆందోళనకు గురైన శ్రీనివాస్ తనను రక్షించాలని కేకలు వేశాడు. దీంతో టీకొట్టు యజమాని రాజు వెంటనే యాలాల పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. ఎస్ఐ విఠల్‌రెడ్డి ఆదేశాలతో బ్లూకోల్ట్ సిబ్బంది క్రూజర్ వాహనాన్ని వెంబడించారు. లక్ష్మీనారాయణపూర్ వద్ద ఉన్న గనుల శాఖ చెక్‌పోస్టు సిబ్బందికి సమాచారం ఇచ్చి వారిని అప్రమత్తం చేశారు. లక్ష్మీనారాయణపూర్ వద్దకు క్రూజర్ రాగానే అడ్డుకొని వాహనంలోని వారందరిని పోలీసులకు అప్పగించారు. అనంతరం రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి యాలాల ఠాణాలో జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతోనే తుప్పుడు సంతోష్ ఈ చర్యకు దిగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో మండలంలో కలకలం రేపింది. -
జీపు బోల్తా: 9 మందికి తీవ్ర గాయాలు
యాలాల: రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తాండూరు నుంచి యాలలకు వస్తుండగా ఓ జిపు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో జీపులో ప్రయాణిస్తున్న 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో డ్రైవర్ సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
యాలాల (రంగారెడ్డి జిల్లా) : ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మంగళవారం యాలాల మండలంలోని కోకట్‌లో వెలుగుచూసింది. కోకట్‌కు చెందిన నర్సింహులు(34) అదే గ్రామంలోని శ్రీనివాసరెడ్డికి చెందిన పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. అతన్ని ఎవరైనా హత్య చేసి అక్కడ పడివేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కలుషిత నీరు తాగి అస్వస్థత
యాలాల (రంగారెడ్డి) : కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం కమాల్‌పూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి నీరు సరఫరా చేసే నీటి ట్యాంక్ అపరిశుభ్రంగా ఉండటం వల్లే ఇలా జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. -
రైతు బలవన్మరణం
యాలాల (రంగారెడ్డి) : సాగు చేసిన వరిపంటకు సరిపోను నీరు లేకపోవటం, బోరు వేయిద్దామన్నా వీలుకాకపోవటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఓ అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండంలోని నాగసముందర్ గ్రామానికి చెందిన తోకల రుస్తుమప్ప(55)కు ఐదెకరాల పొలం ఉంది. ఈ ఏడాది నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. పొట్ట దశలో ఉన్న పైరుకు బోరు నీరు సరిపోవటం లేదు. దీంతో రుస్తుమప్ప మరో బోరు వేయించాలని ప్రయత్నించాడు. కానీ బోరు బండి పొలంలోకి ప్రవేశించే వీలులేకపోయింది. తీవ్ర ఆందోళన చెందిన రైతు శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. -
వివాహిత బలవన్మరణం
యాలాల (రంగారెడ్డి జిల్లా) : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ప్రాణాలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని అచ్యుతాపూర్ గ్రామానికి చెందిన గొల్ల కనకయ్య, లక్ష్మి(40) దంపతులది వ్యవసాయ కుటుంబం. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా ఆ కుటుంబంలో తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనస్తాపం చెందిన లక్ష్మి గురువారం వేకువజామున ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా సమీపంలోనే ఉన్న పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం
యాలాల (రంగారెడ్డి) : ఓ మతిస్థిమితం లేని బాలికపై దుండగులు పైశాచికత్వానికి పాల్పడ్డారు. ఆమెకు మాయ మాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని అచ్యుతాపురం నివాసి అయిన ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.