‘యువ కిరణాలు’ అమలులో కొత్త నిబంధనలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువకిరణాలు పథకం అమలులో కొత్త నిబంధనలు చేర్చారు. ఉచిత శిక్షణ కావడంతో చాలామంది యువతీ యువకులు క్రమశిక్షణ పాటించకపోవటంతో ప్రభుత్వం అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులు మధ్యలోనే డ్రాపౌట్ అవుతుండడంతో శిక్షణ ఇచ్చే సంస్థలు ప్రభుత్వ నిధులు రాక ఇబ్బందులు పడుతున్నాయి.
ఈ పథకంలో 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు గల నిరుద్యోగ నిరుపేద యువతీ యువకులకు ప్రైవేట్ శిక్షణ సంస్థలలో పలు కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గతంలో విద్యార్థులు తరచూ గైర్హాజరై, డ్రాపౌట్ అయ్యేవారు. వీటికి చెక్ పెట్టడంలో భాగంగా కొద్దినెలలుగా హాజరు నమోదు నిమిత్తం బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు శిక్షణ సంస్థకు వచ్చినపుడు, తిరిగి వెళ్లేటపుడు హాజరు తీసుకుంటారు.
ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నిక్షిప్తం కావడంతో గైర్హాజరయ్యేవారి పేర్లను హైదరాబాద్‌లో రాజీవ్ యువ కిరణాలు ఉన్నతాధికారులు తొలగించే ఏర్పాట్లు చేశారు. కోర్సు ప్రారంభం తరువాత, మధ్యలోను, శిక్షణ పూర్తయ్యాక, అభ్యర్థులకు ఉపాధి కల్పించిన తరువాత ప్రభుత్వం విడతల వారీగా శిక్షణ సంస్థలకు నిధులు విడుదల చేస్తుంది. శిక్షణ తీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో జిల్లాగ్రామీణాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ పరిధిలో యూసీడీ అధికారులు పథమం అమలు పర్యవేక్షిస్తున్నారు.. అనకాపల్లి, భీమిలి, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలలో పట్టణ ఐకేపీ పర్యవేక్షణ సాగిస్తోంది. ఆయా శిక్షణ సంస్థలు పత్రికా ప్రకటనల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. ఒక అభ్యర్థికి ఈ పథకం కింద ఒక్క కోర్సులో మాత్రమే శిక్షణ అవకాశం కల్పిస్తారు.