ఆదిలాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీపీ) మంజూరయ్యాయి. జిల్లాలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.2.5 కోట్ల చొప్పున రూ.5కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఏడాదికి అందించే రూ.3కోట్లలో ప్రతీ మూడు నెలలకోసారి రూ.75లక్షల చొప్పున విడుదల చేస్తోంది. ఆ నిధులతో చేపట్టిన పనులు పూర్తయ్యాక మరోమూడు నెలలకు నిధులు విడుదల చేసేది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత రూ.75లక్షలు ఈ ఏడాది మార్చిలోనే విడుదల చేసింది.
అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగతా మూడు విడతల నిధులు రూ.2.5కోట్లను ముందస్తుగానే విడుదల చేసింది. దీంతో అత్యవసర పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. కాగా, ఈ నిధులతో చేపట్టాల్సిన పనులకు సంబంఽధించిన ప్రతిపాదనల తయారీలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు.
జిల్లాకు రూ.5 కోట్లు..
ఆదిలాబాద్ జిల్లాలో బోథ్, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాలు ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. కాగా, శాసనమండలి సభ్యులు టీ జీవన్‌రెడ్డి, దండె విఠల్ ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే ఏ జిల్లానైనా వారు ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో జీవన్‌రెడ్డి నిజా మాబాద్‌ను ఎంపిక చేసుకోగా, దండె విఠల్ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను ఎంపిక చేసుకున్నారు.
వారి కోటా నిధులను ప్రభుత్వం ఆయా జిల్లాలకు కేటాయిస్తోంది. నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలను ఎమ్మెల్యేలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి నిధులు ఒకేసారి రావడంతో అత్యవసరమైన, పెండింగ్ పనులు పూర్తిచేసే వెసులుబాటు ఎమ్మెల్యేలకు కలగనుంది.
ప్రతిపాదనలకే పరిమితమైన గ్రీన్‌ఫండ్
2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.5కోట్ల నియోజకవర్గ అభివృద్ధి నిధులు ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇందులో రూ.2కోట్లను ‘మన ఊరు–మన బడి’ పథకానికి ఖర్చు చేయాలని సూచించింది. మిగతా రూ.3కోట్లలో 10 శాతం అంటే రూ.30లక్షలను గ్రీన్‌ఫండ్‌కు వినియోగించాలని సూచించింది.
దీంతో ఆ నిధులు నియోజకవర్గ పరిధిలో పచ్చదనం పెంపునకు వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ నిధులు జిల్లాలో ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. గతేడాదికి సంబంధించి ప్రతిపాదనలు అందాయే గానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు రూ.30లక్షలకు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు అందించారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రూ.17లక్షలతో ప్రతిపాదనలు అందించగా పనులు కొనసాగుతున్నట్లుగా ప్రణాళిక విభాగం అధికారులు చెబుతున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ రూ.11లక్షలతో కూడిన ప్రతిపాదనలు అందించారు. తాజాగా విడుదలైన నిధుల్లోనూ 10 శాతం నిధులు గ్రీన్‌ఫండ్ కింద ఖర్చు చేయాల్సి ఉండడంతో వాటిని ఏ మేరకు ఖర్చుచేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment