
‘స్వగృహ’కు మోక్షమెప్పుడో?
రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వం తొలిసారి అడుగుపెట్టింది. వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయాలు చేపట్టింది. లేఅవుట్‌లో అన్ని వసతులు కల్పిస్తామని భరోసా ఇవ్వడంతో జనం పోటీపడి మరి వేలంలో పాల్గొని ప్లాట్లను సొంతం చేసుకున్నారు. ఈ ప్రక్రియ ముగిసి 25 నెలలు దాటింది. ఇప్పటికీ అందులో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో కొనుగోలు చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్లాట్ కొనుగోలుతో పాటు ఇంటి నిర్మాణానికి కలిపి పలువురు బ్యాంకుల నుంచి అప్పట్లో రుణాలు పొందారు. నెలలు గడిచినా నిర్మాణ పనులు షురూ కాకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. నిర్దేశిత సమయంలో నిర్మాణ పనులు మొదలు కాని పక్షంలో హౌసింగ్ లోన్ కాస్త పర్సనల్ లోన్‌గా మారిపోతుందేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలోని రాజీవ్ స్వగృహ వెంచర్‌లో ప్రస్తుతం పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. మరో పక్క ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. – సాక్షి, ఆదిలాబాద్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 నవంబర్‌లో రాజీవ్ స్వగృహ పథకం కింద జిల్లా కేంద్రంలోని దుబ్బగూడలో గల 29 ఎకరాల్లో 362 ప్లాట్లతో వెంచర్‌ను రూపొందించింది. వేలం ప్రక్రియ ద్వారా ఇందులో ప్లాట్లను విక్రయించింది. ప్రభుత్వ వెంచర్‌లో అన్ని రకాల మౌలిక వసతులు ఉంటాయని చెప్పడంతో పోటీ పెరిగింది. ప్లాట్ల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.97.14 కోట్ల ఆదాయం సమకూరింది. ఏడాదిలోపు రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్ సరఫరా, తాగునీరు వంటి వసతులు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నెలలు గడుస్తున్నా సదుపాయాల కల్పన పూర్తికాకపోవడంతో బ్యాంకు రుణాలు తీసుకున్న వారు చెల్లింపుపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ పరిస్థితి..
రాజీవ్ స్వగృహ పథకం ద్వారా వేలం ప్రక్రియ నుంచి వచ్చిన డబ్బులు ప్రభుత్వ ఖాతాలోకి చేరాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో వెంచర్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అప్పట్లో ఆదేశించింది. టీజీఐఐసీ నిజామాబాద్‌కు నోడల్ ఏజెన్సీగా బాధ్యతలు అప్పగించింది. రూ.20కోట్ల అంచనా వ్యయంతో వివిధ పనులకు సంబంధించి ఈ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అనంతరం ఇందులో రూ.5.75 కోట్లు వెచ్చించి ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రహదారులను నిర్మించింది. అయితే ఇప్పటి వరకు సంస్థకు కేవలం రూ.3.93 కోట్లు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. మిగతా నిధులు విడుదల కాకపోవడంతో ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
రెండేళ్లు దాటినా సిద్ధం కాని వెంచర్
ప్లాట్ల కొనుగోలుదారులకు తప్పని ఎదురుచూపులు
ఇప్పటికే బ్యాంకుల నుంచి రుణాలు
ఇంటి నిర్మాణ పనులు జాప్యమవుతుండడంతో ఆందోళన
సదుపాయాలు కల్పించాలి
ప్లాట్లు కొనుగోలు చేసిన వారు త్వరగా ఇళ్లను నిర్మించాలనుకున్నప్పటికీ వెంచర్‌లో సదుపాయాలు కల్పించకపోవడంతో నిర్మాణ పనులు ఇంకా షురూ చేయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం త్వరగా మౌలిక సదుపాయాలు కల్పించాలి.
– ఎన్.స్వామి, ప్లాట్ కొనుగోలుదారు
త్వరగా పూర్తయ్యేలా చర్యలు
ప్రస్తుతం వెంచర్‌లో రూ.3.93 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మార్చిలోగా పనులు పూర్తయ్యేలా చూస్తాం. మిగతా పనులను ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులకనుగుణంగా చేపడుతాం. – రాందాస్,
డీజెడ్‌ఎం, టీజీఐఐసీ, నిజామాబాద్

‘స్వగృహ’కు మోక్షమెప్పుడో?

‘స్వగృహ’కు మోక్షమెప్పుడో?
Comments
Please login to add a commentAdd a comment