
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి అందుగులపేట సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లాలోని (బసంత్‌నగర్) కన్నాల గ్రామానికి చెందిన కనుకయ్య (40) ఎన్టీపీసీలో లారీలో జిప్సం నింపుకుని మహారాష్ట్రలోని మణిగఢ్‌కు వెళ్లి వస్తుండగా అందుగులపేట వద్ద జాతీయ రహదారిపై నీళ్ల ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు కావడంతో కనుకయ్య అందులో ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుత్ తీగలకు తగిలి వృద్ధుడు, గేదె..
కాసిపేట: పెరటిచుట్టూ అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి వృద్ధుడు, గేదె మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు కోనూర్‌కు చెందిన అంకతి మల్లయ్య (64)కు చెందిన గేదె కనిపించకపోవడంతో మంగళవారం వెతికేందుకు వెళ్లాడు. ఎంతకూ తిరిగిరాకపోవడంతో అతని కుమారుడు శ్రీకాంత్ తన తండ్రికోసం వెతుకుతుండగా అంకతి రాజయ్య ఇంటి వెనకాల పెరటిచుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్‌వైరు తగిలి మల్లయ్య, గేదె మృతిచెంది ఉండడాన్ని గమనించారు. మృతుని కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు నిందితుడు అంకతి రాజయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని వందఫీట్ల రోడ్డు మూల మలుపు వద్ద 2024 డిసెంబర్ 9న రాత్రి 10 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. హాజిపూర్ మండలం ముల్కల్లకు చెందిన జెట్టి శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై మంచిర్యాలలోని గణేశ్‌నగర్‌కు వెళ్తుండగా సీసీసీ వైపు నుంచి మంచిర్యాలకు బైక్‌పై వస్తున్న జెట్టి శ్రీనివాస్‌ను అతివేగంగా ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ముందుగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. శ్రీనివాస్ తండ్రి ఐలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రాణం తీసిన అప్పు గొడవ
మంచిర్యాలక్రైం: అప్పు ప్రాణానికి ముప్పు అంటారు పెద్దలు..కుటుంబ అవసరం నిమిత్తం భార్యాభర్తలు కలిసి తీసుకున్న రుణం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని వడ్డెరకాలనీలో చోటు చేసుకుంది. ఎస్సై వినీత తెలిపిన వివరాల మేరకు జైపూర్ మండలం ఇందారంకు చెందిన భాగ్యరేఖ(32)కు వడ్డెర కాలనికి చెందిన మనుబోతుల సురేష్‌తో పదేళ్లక్రితం వివాహమైంది. కొద్దిరోజుల క్రితం కుటుంబ అవసరాల నిమిత్తం తెలిసిన వారి వద్ద లక్షా 50వేలు అప్పుగా తీసుకున్నారు. ఈ విషయంలో ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 10న మళ్లీ గొడవ జరగడంతో సురేష్ భీమారంలో ఉంటున్న అక్క ఇంటికి వెళ్లగా భాగ్యరేఖ స్థానికంగా ఉంటున్న అత్తగారింటికి వెళ్లింది. మంగళవారం ఉదయం తాము ఉంటున్న ఇంటికి వచ్చిన భాగ్యరేఖ ఇంటిపైకప్పుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి గంట లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
యువతి అదృశ్యం
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ కాలనీకి చెందిన బూడిద తిరుపతి–సుమలత దంపతుల కుమార్తె శునిష (22) అదృశ్యమైనట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. సదరు యువతి తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండగా తల్లి సుమలత మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల 4న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు తెలిసిన చోట వెతికినా ఆ చూకీ లభించకపోవడంతో మంగళవారం సుమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment