టీనేజ్‌లోనే పక్కదారి..!
● ప్రేమ పేరిట వేధింపులు ● రోజురోజుకూ పెరుగుతున్న ఘటనలు ● ఆకర్షణకు గురవుతున్న బాలికలు ● యువకులపై పోక్సో కేసులు నమోదు
ఆదిలాబాద్‌టౌన్: కొంతమంది యువత టీనేజ్‌లో పక్కదారి పడుతున్నారు. ఏది మంచో.. ఏది చెడో తెలియక యుక్త వయస్సులో ప్రేమలో పడి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయి సాఫీగా జీవితాలను సాగించాలనుకుంటున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు, విభేదాలతో విడిపోతున్నారు. మరి కొంతమంది మైనర్లు ప్రేమలో పడి ప్రియుడితో ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు యువకులపై పోక్సో కేసులు పెట్టడంతో వారు జైలు జీవితం గడుపుతున్నారు. చదువు మధ్యలో మానేసి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారు. అయితే ఇంకొంత మంది యువకులు యువతులను ప్రేమ పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రేమించాలని వెంటబడుతున్నారు. వారు ఒప్పుకోకపోతే దాడులకు దిగుతున్నారు. దీంతో జిల్లాలో అఘాయిత్యాలు, అత్యాచారం, వేధింపుల కేసులు నమోదవుతున్నాయి.
పెరుగుతున్న కేసులు..
మహిళలను వేధిస్తున్న వారి భరతం పట్టేందుకు జిల్లాలో షీటీమ్ బృందాలు పనిచేస్తున్నాయి. డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. 2023లో షీటీమ్‌లో 103, 2024లో 204 కేసులు నమోదయ్యాయి. 2023లో 7 ఎఫ్‌ఐఆర్ కాగా 2024లో 6 కేసులు నమోదయ్యాయి. మిగితావి పీటీ కేసులు నమోదు చేశారు. 2024లో బాలికలను వేధించినందుకు 59 పోక్సో కేసులు నమోదు కాగా 2023లో 55 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కేసులే నమోదు కావడం గమనార్హం. సఖీ కేంద్రం ద్వారా 2023లో 264 కేసులు, 2024లో 293 కేసులు నమోదయ్యాయి. 2024లో 4 రేప్ కేసులు, 185 గృహహింస కేసులు, మైనర్ బాలికలను శారీరకంగా వేధించినందుకు 25 పోక్సో కేసులు, రెండు బాల్య వివాహాలు, 26 మిస్సింగ్ కేసులు, 11 ప్రేమ పెళ్లిలు, చీటింగ్ కేసులు నమోదయ్యాయి.
పెరుగుతున్న వేధింపులు..
మైనర్ బాలికలు, యువతులపై వేధింపులు పెరిగిపోతున్నాయి. కళాశాలలు, పాఠశాలలు, పనిచేసే ప్రదేశాల్లో పోకిరీలు, కీచకులు వేధింపులకు పాల్పడుతున్నారు. కొంతమంది గురువులు సైతం విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చుట్టుపక్కల వారు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ చాలా మందిలో మార్పు రావడం లేదు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
వేధిస్తే కఠిన చర్యలు
యువతులు, బాలికలు, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాలికలను వేధిస్తే పోక్సో కేసులు నమోదు చేస్తాం. యువతులు ప్రేమ పేరిట ప్రలోభాలకు గురికావొద్దు. విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దు. మహిళల రక్షణ కోసం షీటీమ్ పనిచేస్తుంది. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతాం.
– ఎల్.జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ
టీనేజ్‌లోనే పక్కదారి..!
Comments
Please login to add a commentAdd a comment