తోడేస్తున్నారు..
ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం
అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక, మొరం తవ్వకాలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. బేల, జైనథ్, భీంపూర్ మండలాల్లోని నది పరీవాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టకుండా చర్యలు చేపడుతున్నాం. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. మొదటిసారి జరిమానా విధించి వదిలిపెడుతున్నాం. పునరావృతమైతే కేసులు నమోదు చేస్తాం. సీజ్ చేసిన ట్రాక్టర్లను మైనింగ్ అధి కారులకు అప్పగిస్తున్నాం.
– ఎల్.జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ
బేల మండలంలోని కంగార్‌పూర్ శివారులో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టగా జైనథ్, బేల ఎస్సైలు శనివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. మైనింగ్ అధికారులకు సమాచారం అందించారు. మరోసారి ఇసుక అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జైనథ్ మండలంలోని ఆనంద్‌పూర్‌లో అక్రమార్కులు బోట్‌లో ఆయిల్ ఇంజిన్ ఏర్పా టు చేసి నదిలో ఉన్న ఇసుకను ఒడ్డుకు చేర్చుతున్నారు. పైపులైన్ ద్వారా ఇసుకతో పాటు నీరు ఒడ్డున పడుతుంది. జల్లెడ ద్వారా వేరయిన ఇసుకను ట్రాక్టర్ యజమానులకు విక్రయిస్తారు. అయితే ఏడు నెలల క్రితం పోలీసులు దాడులు నిర్వహించి బోట్‌తో పాటు ఆయిల్ ఇంజిన్‌ను సీజ్ చేశారు. అయినా అక్రమార్కుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. తాజాగా మళ్లీ ఇసుక అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. రాత్రి వేళల్లో ఈ దందా సాగుతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు తనిఖీలు చేసినప్పుడు స్తబ్ధుగా ఉండి ఆ తర్వాత వారి పని కానిచ్చేస్తున్నారు.
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న పెన్‌గంగ నదిలో కొందరు అక్రమ తవ్వకాలు చేపట్టి ఇసుకను తోడేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. మైనింగ్ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడంతో వీరి దందా ‘మూడు టిప్పర్లు.. ఆరు ట్రాక్టర్లు’ అన్న చందంగా మారిందనే విమర్శలున్నాయి. ఇక పోలీసు, రెవెన్యూ అధికారులు తని ఖీలకు వెళ్తున్నారంటే వారికి ముందుగానే సమాచా రం అందుతుంది. అధికారులు అక్కడికి చేరుకున్నా క అసలు అక్కడ తవ్వకాలే జరగనట్టుగా ఉంటుంది. ఈ దందా రాత్రి వేళల్లో జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. అక్రమార్కులపై కొరడా ఝుళిపించేందుకు సమాయత్తమయ్యారు. ఇటీవల జైనథ్, బేల, భీంపూర్, తాంసి మండలాల పరిధిలో ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాలను పరి శీలించారు. ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.
నది పరీవాహక ప్రాంతాల్లో..
పెన్‌గంగ నది పరీవాహక ప్రాంతాలైన జైనథ్, భీంపూర్, బేల మండలాల్లోని తాంసి(కె), వడూర్, అంతర్‌గావ్, ఆనంద్‌పూర్, పెండల్‌వాడ, డొల్లార, సాంగ్వి, కౌట, పూసాయి, పిప్పర్‌వాడ, కామాయి, కంగార్‌పూర్, సాంగిడి, బెదోడతో పాటు తదితర గ్రా మాల్లో ఇసుక అక్రమ దందా సాగుతోంది. వానా కాలం ముందు వరకు పెన్‌గంగ నుంచి తోడిన ఇసుకను అనుకూలంగా ఉన్న చోట్ల కుప్పలుగా నిల్వ ఉంచుతున్నారు. వర్షాలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ నుంచి తిరిగి నది పరీవాహక ప్రాంతాల్లోని ఇసుకను భారీ యంత్రాలతో తోడేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని వీడీసీలు, గ్రామ పెద్దల ద్వారా వేలం నిర్వహించి ఎవరో ఒకరు టెండర్ దక్కించుకుంటా రు. ఆ తర్వాత టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక మైనింగ్ అధికారులు నామమాత్ర తనిఖీలకే పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు, పోలీ సులు పట్టుకున్న వాహనాలకు జరిమానా విధించ డం తప్పా అక్రమ దందాకు అడ్డుకట్ట వేయలేకపోవడం గమనార్హం. జిల్లాలో మైనింగ్ అధికారితో పాటు ఓ టెక్నికల్ అధికారి ఉన్నారు. మైనింగ్ అధి కారికి నిర్మల్ జిల్లా అదనపు బాధ్యతలు ఉండడంతో ఆయన ఇటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరో పణలు ఉన్నాయి. ఇక టెక్నికల్ అధికారి ని మరో జిల్లాకు డిప్యూటేషన్ ఇవ్వడంతో పది రో జులుగా అందుబాటులో లేకుండా పోయారు. ఉన్న అధికారి సైతం కార్యాలయంలో ఉండకపోవడం, ఎవరైన సమాచారం అందించేందుకు ఫోన్ చేసినా స్పందించపోవడం ఈ అక్రమార్కులకు కలిసి వస్తోంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
జిల్లా సరిహద్దున ఉన్న పెన్‌గంగ నది సుమారు 70 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. బేల, భీంపూర్, జైనథ్ మండలాల పరిధిలోని పరీవాహక ప్రాంతాల్లో అక్రమార్కులు పొక్లెయిన్లు, ఇతర యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు. ఈ తవ్వకాలతో ఎక్కడబడితే అక్కడ లోతైన గుంతలు దర్శనమిస్తున్నా యి. దీంతో భూగర్భజలాలు అడుగంటిపోయే పరి స్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు అక్రమార్కులు వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాలు, మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
అక్రమార్కులపై నిఘా..
జిల్లాలోని బేల,భీంపూర్, తాంసి, తలమడుగు, జై నథ్ మండలాల్లో అక్రమంగా ఇసుక, మొరం తవ్వకాలు జరుపుతున్న వారిపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌తో పాటు చెక్‌పోస్టులను ఏర్పా టు చేశారు. ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.
పెన్‌గంగలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు రాత్రి వేళల్లో జోరుగా అక్రమ రవాణా పట్టించుకోని మైనింగ్ అధికారులు రంగంలోకి దిగిన పోలీసు శాఖ
దొడ్డిదారిన వేలం..
జిల్లాలో ఇసుక పాలసీ లేకపోవడంతో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం సమకూరే పరి స్థితి లేకుండా పోయింది. గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)లు దొడ్డి దారిన వేలం నిర్వహిస్తున్నాయి. స్థానిక అవసరాల కోసం ఇసుకను ఉపయోగిస్తామని తెలుపుతూ ఈ వేలం ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏడాదికి రూ.అరకోటి పైగా ఆదాయం సమకూరుతుంది. గతేడాది బేల మండలం కాంగార్‌పూర్‌లో ఇసుక తవ్వకాల కోసం ఓ కాంట్రాక్టర్ రూ.62 లక్షలు, సాంగిడిలో రూ.30లక్షలు, ఆనంద్‌పూర్‌లో రూ.22 లక్షలు అందించినట్లు సమాచారం. జల్లెడ పట్టిన ఇసుక ట్రాక్టర్‌కు రూ.1500 వరకు, అలాగే కొన్ని వీడీసీలు రూ.300 నుంచి రూ.500 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు ఆ ఇసుకను ఆదిలాబాద్ పట్టణంలో రూ.4వేల వరకు విక్రయిస్తున్నారు.
తోడేస్తున్నారు..
తోడేస్తున్నారు..
Comments
Please login to add a commentAdd a comment