‘మా భూములు మాకివ్వాలి’
ఆదిలాబాద్: సీసీఐ కోసం సేకరించిన భూములను తిరిగి తమకు అప్పగించాలని సీసీఐ భూనిర్వాసితుల సంఘం నాయకుడు అరవింద్ కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన గురువారం సంఘం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీసీఐ పరిశ్రమ ఏర్పాటు సమయంలో స్థానిక రైతుల నుంచి 779 ఎకరాల సాగు భూమిని నాటి కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు పరిహారమిచ్చి సేకరించిందని ఆరోపించారు. పరిశ్రమలో వందేళ్ల దాకా రైతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ పరిశ్రమను 1998లో మూసివేయడంతో భూములు కో ల్పోవడమే కాకుండా ఉద్యోగాలనూ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. 30 ఏళ్లుగా ఈ పరిశ్రమ ప్రారంభం కోసం పాలకులు ఎన్నికల్లో హామీ ఇస్తూ పూర్తిగా విస్మరిస్తున్నారని విమర్శించారు. ఈ పరిశ్రమను స్క్రాప్ కింద అమ్ముకోవడానికి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం అనుమతితో టెండర్ ప్రక్రియ కొనసాగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఇంతవరకు పరిశ్రమ పునరుద్ధరణ జరుగుతుందని ఎంతో ఆశతో ఉన్నామని, ప్రస్తుతం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆశలు సన్నగిల్లాయని పేర్కొన్నారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమ పునరుద్ధరణకు ప్రయత్నించాలని, లేని పక్షంలో తీసుకున్న పరిహారం సొమ్ము తిరిగి ఇస్తామని, తమ భూములు తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాజన్న, ఈశ్వర్ దాస్, రామ్‌రెడ్డి, కృష్ణ, విఠల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment