భర్తీ ఎప్పుడో..?
● అంగన్‌వాడీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగుల నిరీక్షణ ● జిల్లాలో 129 టీచర్, 523 ఆయా పోస్టులు ఖాళీ
ఆదిలాబాద్‌టౌన్: అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి మోక్షం లభించడం లేదు. ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందడం లేదు. అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టుల నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ మహిళలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతామని ప్రకటించడంతో వారంతా నిరీక్షిస్తున్నారు. దీనికితోడు ఇటీవల జిల్లాలో 65 ఏళ్లు పైబడిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ పొందడంతో మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. ఆయాలు ఉన్న చోట టీచర్లు లేరు. మరికొన్ని చోట్ల ఆయాలు లేకపోవడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా రెండు, మూడు నెలల క్రితం కొంత మంది అంగన్‌వాడీ ఆయాలకు పదోన్నతి కల్పించారు. మిగతా వారి జాబితాను సిద్ధం చేసినప్పటికీ ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో పదోన్నతులు కల్పించలేదని చెబుతున్నారు. ఆయాల పదోన్నతులు, బదిలీ ప్రక్రియ తర్వాతే పోస్టుల భర్తీకి మోక్షం లభిస్తుందని ఆ శాఖాధికారులు చెబుతున్నారు.
ఖాళీలతో తంటాలు..
జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. జైనథ్, నార్నూర్, ఉట్నూర్, బోథ్, ఆదిలాబాద్ అర్బన్‌లో ఉండగా వీటి పరిధిలో 1256 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 129 టీచర్ పోస్టులు, 523 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నా యి. చాలా కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు లేకుండానే కేంద్రాలను నడుపుతున్నారు. ఆయాలు లేకపోవడంతో పిల్లలను ఇంటి నుంచి తీసుకురా వడం, కేంద్రంలో వంట చేయడం తదితర సమస్యలు ఏర్పడుతున్నాయి. టీచర్లు లేకపోవడంతో విద్యాబోధన సాగడం లేదు. కొన్ని కేంద్రాల్లో పౌష్టికాహారం అందించి ఇంటికి పంపుతున్నారు. పిల్లల ఎత్తు, బరువు కొలతలు తదితర వివరాలు తీసుకోవడం ఇబ్బందిగా మారింది.
ఏడుగురికే పదోన్నతి.. మిగతా వారి సంగతేంటి?
జిల్లాలో ఇటీవల 65 ఏళ్లుపైబడిన 50 మంది అంగన్‌వాడీ టీచర్లు, 146 మంది ఆయాలు ఉద్యోగ విరమణ పొందారు. దీంతో మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. అర్హతలు గల ఆయాలకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐసీడీఎస్ అధికారులు ఆదరాబాదరగా కొంత మందికే పదోన్నతులు కల్పించి మిగతా అర్హులైన వారిని విస్మరించారు. కేవలం ఏడుగురికి పదోన్నతి కల్పించారు. మరోపది మందికిపైగా అర్హత గల ఆయాలు దరఖాస్తులు చేసుకున్నారు. రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్పా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వీరి పదోన్నతులు జరిగితే ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
జిల్లాలో..
అంగన్‌వాడీ కేంద్రాలు 1,256
పనిచేస్తున్న టీచర్లు 1,127
టీచర్ పోస్టు ఖాళీలు 129
పనిచేస్తున్న ఆయాలు 733
ఆయా పోస్టు ఖాళీలు 523
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు..
అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. సర్కారు ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. ప్రస్తుతం టీచర్ల పదోన్నతి ప్రక్రియ జరగాల్సి ఉంది. రోస్టర్ ప్రక్రియ తయారు చేయాలి. ఇదివరకు బదిలీ అయిన టీచర్ల స్థానంలో అర్హత గల ఏడుగురు ఆయాలకు పదోన్నతి కల్పించాం. మిగతా వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాం. త్వరలో వారికి పదోన్నతి ప్రక్రియ పూర్తి చేస్తాం. ప్రస్తుతం జిల్లాలో 129 అంగన్‌వాడీ టీచర్లు, 523 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నాం.
– మిల్కా, ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ
Comments
Please login to add a commentAdd a comment