
ఆఫ్‌లైన్‌లోనూ ‘యువ వికాసం’
● ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకున్నా దరఖాస్తుకు అవకాశం ● ఈనెల 14వరకు గడువు
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువును ఈ నెల 14వరకు పొడిగించిన సంగతి తెలి సిందే. అయితే ఇప్పటి వరకు కేవలం మీసేవ కేంద్రాల్లోనే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించగా తాజాగా ఆఫ్‌లైన్‌లోనూ అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక నమూనా దరఖాస్తు ప్రతులను జిల్లాకు పంపించింది. వాటిని అన్ని ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈబీసీ(ఈడబ్ల్యూఎస్) కులాలకు చెందిన నిరుద్యోగ యువత బుధవారం నుంచి ఆయా కేంద్రాలను సంప్రదించి మ్యానువల్‌గానూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కేంద్రాల్లో అందించిన దరఖా స్తులను పంచాయతీ కార్యదర్శులు, బల్దియా సి బ్బంది ఆన్‌లైన్ చేయనున్నారు. ఇది వరకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఆఫ్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ రాజర్షి షా మంగళవారం జిల్లాలోని ఎంపీడీలు, సంబంధిత సంక్షేమాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఆదాయ ధ్రువపత్రం లేకున్నా అవకాశం..
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే తహసీల్దార్లు జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణపత్రం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో వాటి కోసం రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. దీంతో సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందులో కొంత మినహాయింపునిచ్చింది. తెల్లరేషన్ కార్డు కలిగిన వారు ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకున్నా దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించారు. రేషన్ కార్డు నంబర్‌ను దరఖాస్తుతో పొందుపరిస్తే సరిపోతుంది. అయితే తెల్ల రేషన్‌కార్డు లేనటువంటి వారు మాత్రం తప్పనిసరిగా తహసీల్దార్ జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి..
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఏ విధానంలోనైనా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తప్పనిసరిగా ఆధార్, పాన్, కుల, ఆదాయ, విద్యార్హత ధ్రు వీకరణ పత్రాలు, బ్యాంక్ పాస్‌బుక్ ప్రతులను జత చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు తమ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అప్‌లోడ్ చేసిన ధ్రువీకరణపత్రాలను దానికి జత చేసి సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణపత్రాలను జతచేసి అందజేస్తే సరిపోతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారి కుటుంబ వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని ఆదాయం రూ.2లక్షలలోపు ఉన్నవారు మాత్రమే ఈ పథకం దరఖాస్తుకు అర్హులు. ఈ పత్రాలతో పాటు, బ్యాంక్ సమ్మతి తప్పనిసరిగా ఉండాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
యువ వికాసం పథకం వివరాలు
యూనిట్ విలువ సబ్సిడీ బ్యాంకు లోన్
రూ.50వేలు వందశాతం ––
రూ.50,001–1,00,000 90శాతం 10 శాతం
రూ.1,00,001– 2,00,000 80శాతం 20శాతం
రూ.2,00,001–4,00,000 70శాతం 30శాతం