డ్వాక్రా సంఘాలను మోసం చేసిన చంద్రబాబు
వాయిదాలు చెల్లించక అప్పులు పాలైన మహిళలు
సీఎం జగన్ హయాంలో మహరాణుల్లా అతివలు
వైఎస్సార్ ఆసరాతో బతుకులకు భరోసా
మొత్తం 4 విడతల్లో రుణమాఫీ చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం/అనంతగిరి: పొదుపు ఉద్యమం.. మహిళల్లో క్రమశిక్షణ, అంకితభావానికి నిదర్శనం. రూపాయి రూపాయి కూడబెట్టి దాన్ని పరపతిగా చూపి.. తీసుకున్న కొద్దిపాటి అప్పులతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించారు. తమ కాళ్ల మీద తాము నిలబడడమే కాదు.. కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉవ్వెత్తున ఎగసిన పొదుపు ఉద్యమానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డి పావలా వడ్డీ పథకంతో ఊతమిచ్చారు. ప్రతి మహిళను లక్షాధికారి చేయాలని తపించారు. ఆ దిశగా కృషి చేశారు.
అంతటి గొప్ప చరిత్ర కలిగిన డ్వాక్రా ఉద్యమం చంద్రబాబు హయాంలో కునారిల్లిపోయింది. ఈ పరిస్థితికి కారణం 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ హామీయే. ఈ హామీ ఐదేళ్లలో ఎన్నో వేల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. బాబు ఇచ్చిన హామీ పుణ్యమాని వాయిదాలు కట్టని పాపానికి డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించింది. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అక్క చెల్లెమ్మలకు ఆసరాగా నిలిచారు. బాబు ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చి.. మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు.
చంద్రబాబు మాటలు నమ్మి సకాలంలో వాయిదాలు కట్టకపోవడంతో జిల్లాలో వేల సంఘాల సభ్యులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు. దీంతో 2018–19 నాటికి పూర్తిగా డిఫాల్ట్ లిస్ట్‌లో చేరిన సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో 150, అర్బన్ ప్రాంతాల్లో 125 వరకు ఉన్నాయి. వడ్డీ, చక్ర వడ్డీలు కలిపి ఏడు నుంచి పది లక్షల వరకు బకాయిలు పేరుకుపోయిన సంఘాలు గ్రామీణ ప్రాంతంలో 192, అర్బన్ ప్రాంతంలో సుమారు 300 వరకు ఉన్నాయి. ఈ సంఘాల్లోని పొదుపు సొమ్ములనే కాదు.. చివరకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మంజూరైన పసుపు కుంకుమ సొమ్మును కూడా బ్యాంకులు తమ అప్పు ఖాతాలకు జమ చేసేశాయి. మిగిలిన బకాయిల కోసం పలు దఫాలు నోటీసులు ఇచ్చిన బ్యాంకులు కోర్టు ద్వారా కూడా నోటీసులు జారీ చేశాయి. దీంతో.. బాబు చేసిన మోసానికి తామేం పాపం చేశామంటూ పొదుపు సంఘాల్లోని మహిళలు గగ్గోలు పెట్టారు.
రుణమాఫీ జరిగిందిలా..
విశాఖ జిల్లాలో 2019 ఏప్రిల్ 11 నాటికి 4,305 ఎస్‌హెచ్‌జీలకు ఉన్న రూ.700 కోట్లకు పైగా రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేసింది.
అనకాపల్లి జిల్లాలో 2019 ఏప్రిల్ 11 నాటికి 31,892 ఎస్‌హెచ్‌జీలకు ఉన్న రూ.992.57 కోట్ల బకాయిలను నాలుగు దఫాలుగా చెల్లించింది.
అల్లూరి జిల్లాలో 2019 ఏప్రిల్ 11 నాటికి 39,743 సహాయక సంఘాలకు ఉన్న రూ.134.37 కోట్ల రుణాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగు దఫాలుగా జమ చేసింది.
బాబు కుట్రతో.. వెలివేసిన పరిస్థితులు
బకాయిల కోసం కోర్టు ద్వారా నోటీసులిప్పించడమే కాదు.. ఆ కుటుంబాల్లోని పిల్లలకు ఎస్సీ, బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. ఆదరణ పనిముట్లు సైతం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది. హౌసింగ్ రుణాలు, చివరికి మరుగుదొడ్ల పేమెంట్స్ కూడా నిలిపేసింది. ఓ విధంగా చెప్పాలంటే ఆ కుటుంబాలను వెలివేసినట్టుగా చంద్రబాబు ప్రభుత్వం చేసింది.
‘ఆసరా’తో సీఎం జగన్ భరోసా
ప్రజాసంకల్ప యాత్రలో అక్క చెల్లెమ్మల దుస్థితిని గమనించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వారందరికీ ‘ఆసరా’గా ఉంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే.. వైఎస్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్వయం సహాయక బృందాలు చెల్లించాల్సిన బకాయిలను సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. వైఎస్సార్ సున్నా వడ్డీతో రుణాలు మంజూరు చేసి, వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున మంజూరు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి బాసటగా నిలిచారు. అతివలను అడుగడుగునా బాబు వంచనకు గురి చేయగా.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ప్రతి అడుగు వారి ఆర్థికాభివృద్ధి కోసమే అన్నట్లుగా భరోసానిచ్చి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
Comments
Please login to add a commentAdd a comment