సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
సీటు కోసం నోటికి పని చెప్పి... వయస్సును కూడా మరచిన బండారు బెండు వంచింది సొంత పార్టీ. రానున్న ఎన్నికల్లో పెందుర్తి నుంచి టికెట్ లేదంటూ ఆ పార్టీ అధినేత బండారుకు తేల్చిచెప్పినట్టు సమాచారం. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఈ సీటును ఆ పార్టీకి కేటాయించనున్నట్టు పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఒకవేళ ఎన్నికల రాజకీయంలో ఉండాలంటే మాడుగుల నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తేల్చిచెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, మాడుగుల నుంచి బరిలోకి దిగేందుకు బండారు ససేమిరా అంటున్నారు. పెందుర్తి టికెట్ కావాలంటూ అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేందుకు వయస్సును కూడా మరచి మంత్రి రోజాపై అవాకులు చెవాకులు పేలారు. అయినప్పటికీ బండారుకు గ్రీన్‌సిగ్నల్ లభించలేదు.
పైగా ఆయన వ్యాఖ్యలతో మరింతగా పరిస్థితి దిగజారిపోయిందంటూ సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే ఇక బండారు సత్యనారాయణమూర్తి రాజకీయ చాప్టర్ ముగిసిన అధ్యాయమేనని ఆయన వర్గీయులే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా సీటు కోసం నోటికి పనిచెప్పి ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని దిగజార్చుకున్నా ఫలితం లేకపోవడంతో తన సన్నిహితుల వద్ద పార్టీ అధినాయకత్వంపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి రోజాపై వ్యాఖ్యల తర్వాత బండారు రాజకీయ గ్రాఫ్ మరింత వేగంగా దిగజారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
వాస్తవానికి గతంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా కూడా బండారు పనిచేశారు. గత ఎన్నికల్లో యువకుడైన అదీప్‌రాజ్ చేతిలో మట్టికరిచారు. అప్పటి నుంచి ఎలాగోలా వార్తల్లో ఉండేలా బండారు నోటికి పనిచెబుతూ వస్తున్నారు. ప్రభుత్వంపై ఏదో ఒక ఆరోపణ చేస్తూ వార్తల్లో నిలిచే విధంగా చూసుకున్నారు. అయితే, ప్రజల్లో మద్దతు కోల్పోవడంతో ఆయనకు సీటు ఇచ్చినా గెలిచే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసినా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.
ఆయన కుమారుడు వ్యవహరించిన తీరు ప్రజల్లో వ్యతిరేకతను మరింతగా పెంచింది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదు. కేవలం భూకబ్జాలకే పరిమితమయ్యారన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే పెందుర్తి నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలంటూ జనసేన పార్టీ పట్టుబట్టింది. అయితే, పెందుర్తి నుంచి టికెట్ ఇవ్వకపోతే తన సత్తా చూపిస్తానంటూ బండారు సన్నిహితుల వద్ద తేల్చిచెబుతున్నట్టు తెలుస్తోంది. వయసైపోయిన నేపథ్యంలో తనకు రాజకీయ భవిష్యత్ లేకుండా పోతుండటం.. ఇప్పటికీ వారసత్వంగా కొడుకును పరిచయం చేయకపోవడం బండారును చాలా బాధ పెడుతున్నట్టు తెలుస్తోంది.
పెందుర్తి సీటుపై జనసేన కన్ను
గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలవడంతో ఈ సీటు కోసం జనసేన పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానంటూ పంచకర్ల రమేష్‌బాబు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికారికంగా పార్టీ ప్రకటించనప్పటికీ ఈ సీటు తనదేనని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే, సీటు జనసేనకు కేటాయించినా తెలుగుదేశం పార్టీ వర్గాలు సహకరించేది కష్టమేననన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటికీ సీట్ల వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో తెలుగుదేశం–జనసేన కలిసి జెండాలు పట్టుకుని రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. ఇక్కడ మాత్రం ఎక్కడా కలిసి కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ అధికారికంగా బండారుకు ఝలక్ ఇస్తే.. జనసేన అభ్యర్థికి సహకరించడం కష్టమేనని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఇరు పార్టీల పొత్తుకు ఇక్కడి నుంచే బీటలు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment