ముంచంగిపుట్టు: స్థానిక సీహెచ్‌సీలో గత ఐదు నెలలుగా గర్భిణులకు అల్ట్రాసౌండ్ పరీక్షలు నిలిచిపోయాయి.దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రతి మంగళ, గురు వారాల్లో సీహెచ్‌సీలో గర్భిణులకు ఉచితంగా అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసి శిశువు ఆరోగ్య పరిస్థితి, హృదయ స్పందన తదితర వివరాలు తెలుసుకుంటారు. దీంతో గర్భిణులు ముందుగా జాగ్రత్త పడేందుకు ఆస్కారం ఉంటుంది. గతంలో పాడేరు జిల్లా ఆస్పత్రి నుంచి గైనికాలజిస్ట్ వచ్చి సీహెచ్‌సీలో అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసేవారు. గైనికాలజిస్ట్ లేక నవంబర్ నెల పరీక్షలు చేయకపోవడంతో గర్భిణులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వైద్యుల సూచనల మేరకు ప్రతి వారం 40 నుంచి 50మంది గర్భిణులు 52కిలో మీటర్ల దూరంలో ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రికి వెళ్లి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.అల్ట్రాసౌండ్ పరీక్షల నిర్వహణకు స్థానిక సీహెచ్‌సీలో అన్ని సౌకర్యాలు ఉన్నా గైనికాలజిస్ట్ లేక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తక్షణమే వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి గైనికాలజిస్ట్‌ను నియమించాలని మండల వాసులు కోరుతున్నారు.ఈ విషయంపై స్థానిక వైద్యాధికారి గీతాంజలిని వివరణ కోరగా గైనికాలజిస్ట్ లేకపోవడం వల్ల అల్ట్రాసౌండ్ పరీక్షలు ఐదు నెలల నుంచి నిలిచాయని చెప్పారు. ఉన్నతాధికాలకు సమస్యను తెలియజేసినట్టు ఆమె తెలిపారు.
గైనికాలజిస్ట్ లేక ఇబ్బందులు
పాడేరు వెళ్లేందుకు అవస్థలు పడుతున్న గర్భిణులు