సీపీఎం ఆందోళన
చింతూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటుతున్నా సూపర్‌సిక్స్ హామీలు నేటికీ అమలు చేయక పోవడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం చింతూరు ఐటీడీఏను ముట్టడించారు. చింతూరు నుంచి ర్యాలీగా వెళ్లి హామీలు అమలు చేయాలంటూ ఐటీడీఏ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ మాట్లాడుతూ సూపర్‌సిక్స్ హామీలు ఎక్కడా అమలు కావడం లేదని, మహిళలకు నెలకు రూ.1,500, ఏభైఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పింఛన్లు అమలు చేయలేదన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అవగాహన లేని అధికారులను గ్రామసభలకు పంపి నిర్వాసితులను గందరగోళ పరుస్తున్నారని ఆయన విమర్శించారు. గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వలస ఆదివాసీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, రేషన్‌కార్డుల సమస్యలు పరిష్కరించాలని, గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్టీ నాయకులు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం లక్ష్మి, సీసం సురేష్, పులి సంతోష్, సుబ్బమ్మ, శ్రీనివాసరావు, వెంకట్, ప్రదీప్, వెంకమ్మ, రాజయ్య పాల్గొన్నారు.