ముంచంగిపుట్టు సీహెచ్‌సీ ఘనత
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రసవాలలో రికార్డు సృష్టించింది. ఈ ఆస్పత్రిలో ఒక్క నెల రోజుల్లోనే 100 మందికి పురుడు పోశారు. సీహెచ్‌సీ చరిత్రలో ఇప్పటి వరకు నెలలో 100 డెలివరీలు ఎప్పుడూ జరగలేదు. అన్నీ సాధారణ ప్రసవాలే కావడం విశేషం. 200 పడకలు ఉన్న చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో మార్చి నెలలో 82 ప్రసవాలు జరగగా, 200 పడకలు ఉన్న అరకువేలి ఏరియా ఆస్పత్రిలో 109 జరిగాయి. కేవలం 30 పడకలు ఉన్న ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో 100 ప్రసవాలు జరగడం వైద్యులు, సిబ్బంది కృషికి అద్దం పడుతోంది. స్థానిక సీహెచ్‌సీ సూపరింటెండెంట్ కిముడు గీతాంజలి పర్యవేక్షణలో వైద్యులు సంతోష్, ధరణి, హెడ్ నర్స్ సింహాచలం, స్టాఫ్ నర్సులు, నర్సులు, సపోర్టింగ్ స్టాఫ్, వైద్య సిబ్బంది శ్రమించి నెల రోజుల్లో 100 మంది గర్భిణులకు పురుడు పోశారు. ఈ సందర్భంగా సీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఇంటి వద్ద ప్రసవాల వల్ల కలిగే నష్టాలను క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది వివరించి, ఆస్పత్రులలో పురుడు పోసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేసి, చైతన్యవంతులను చేయడంతో ప్రభుత్వ ఆస్పత్రులలో డెలివరీల సంఖ్య పెరుగుతుందని అన్నారు. సీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది కృషి వల్లనే 100 ప్రసవాలు చేయడం జరిగిందని, 51మంది మగ పిల్లలు, 47 మంది ఆడపిల్లలు జన్మించారని, ఇద్దరు శిశువులు చనిపోయి పుట్టారని వివరించారు. ఆస్పత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.
సీహెచ్‌సీలో సదుపాయాలు కరువైనా..
ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో గర్భిణుల ప్రసవాలకు సదుపాయాలు అంతంతమాత్రమే. ముఖ్యంగా గర్భిణులకు గైనికాలజిస్ట్ లేరు. దీంతో అల్ట్రాసౌండ్ పరీక్షలు గత కొన్ని నెలలుగా జరగడం లేదు. అన్ని విభాగాలకు చెందిన 8మంది వైద్యులు ఉండాల్సి ఉండగా ముగ్గురు మాత్రమే ఉన్నారు. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని 46 పంచాయతీలకు చెందిన 724 గ్రామాలకు ముంచంగిపుట్టు సీహెచ్‌సీ ప్రధాన దిక్కుగా ఉంది. ప్రతి రోజు 200 నుంచి 250 వరకు ఓపీ నమోదవుతుంది. మలేరియా, టైఫాయిండ్ వంటి జ్వరాలతో రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారు. కేవలం 30 పడకల ఆస్పత్రి కావడంతో గర్భిణులకు, రోగులకు వార్డులలో పడకల కేటాయింపులో వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు సీహెచ్‌సీలో పెరుగుతున్న రోగుల సంఖ్య, గర్భిణుల ప్రసవాలను దృష్టిలో పెట్టుకొని సీహెచ్‌సీని అప్‌గ్రేడ్ చేసి వంద పడకల ఆస్పత్రిగా చేస్తే గిరిజనులకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందేందుకు ఆస్కారం ఉంది. ఆ దిశగా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, వైద్యశాఖ ఉన్నతాధికారులు చొరవ చూపాలని గిరిజనులు కోరుతున్నారు.
అన్నీ సాధారణ ప్రసవాలే..
ఒక్క నెలలోనే 100 మందికి
పురుడు పోసిన వైద్యులు
ప్రసవాల్లో రికార్డ్
ప్రసవాల్లో రికార్డ్