ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చిందని తమ కుమారుడు చెప్పిన మాటలకు ఆ తల్లిదండ్రులు ఎంతగానో పరవశించిపోయారు. ఆదివారం వైజాగ్ వెళ్లి చేరుతానని స్నేహితులతో సైతం తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇంతలోనే కాలువలో ఈతకు దిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు.
అనకాపల్లి: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లిన యువకుడు తాండవ కాలువలో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని శృంగవరంలో శనివారం చోటు చేసుకుంది. నాతవరం ఇన్‌చార్జి ఎస్‌ఐ రామారావు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పైల స్వామినాయుడు అలియాస్ వినయ్ (23) శనివారం తోటి స్నేహితులతో కలిసి గాంధీనగరం గ్రామ సమీపంలో తాండవ కాలువలో ఈతకు దిగాడు. కొంత సేపు ఈత కొట్టాక అందరూ ఒడ్డుకు చేరుకోగా, స్వామినాయుడు రాకపోవడాన్ని గమనించిన స్నేహితులు కాలువలో పరిశీలించారు.
అతడు ఈత కొట్టే ప్రదేశంలో నాచు పెరిగిపోయి లాకులు ప్రమాదకరంగా ఉన్నాయి. దాంతోనే లాకులో చిక్కుకుపోయి మరణించినట్టు తెలుస్తోంది. గతంలో ఇలా చాలా మంది చిక్కుకొని మృతి చెందినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మృతుడు తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు నాతవరం హెడ్ కానిస్టేబుల్ నాగరాజు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ప్రైవేటు ఉద్యోగం వచ్చిందని...
పైల అప్పలనాయుడు, సత్యవతి దంపతుల చిన్న కుమారుడు వినయ్ కాకినాడ జిల్లా కోటనందూరులో ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. సత్యవతి అక్క అల్లు ఎరుకులమ్మకు సంతానం లేకపోవడంతో పెద్ద కుమారుడు మహేష్‌ను దత్తత ఇచ్చారు.
అతడు గ్రామ వలంటీరుగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రైవేటు కంపెనీలో చేరడానికి ఆదివారం ఉదయం వైజాగ్ వెళ్తానని స్నేహితులతో వినయ్ చెప్పాడు. కొడుకు ఉద్యోగంలో చేరుతున్న విషయం తెలిసి తల్లిదండ్రులు ఆనందపడ్డారు. ఇంతలో ఉద్యోగంలో చేరకుండానే అతడు మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. చేతికందివచ్చిన కుమారుడు మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment