జీడికి మద్దతు ధరపై అసెంబ్లీలో చర్చించాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న
దేవరాపల్లి: జీడి పంటకు మద్దతు ధర కోసం అసెంబ్లీలో చర్చించి జీడి బోర్డు ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి బి.టి. దొర డిమాండ్ చేశారు. మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ పరిధిలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు వెంకన్న, దొర మాట్లాడుతూ జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో దళారుల చేతిలో రైతులు ఘోరంగా మోసపోతున్నారని వాపోయారు. ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. ఏటా వాణిజ్య పంటలకు మద్దతు ధర ప్రకటించి జీడిని విస్మరిస్తున్నారన్నారు. ప్రైవేటు వ్యాపారులు దీనిని ఆసరాగా తీసుకుని ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడి పరిశోధన కేంద్రాలను ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసి నాణ్యమైన జీడి మొక్కలను రైతులకు అందించాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో జీడి తోటల అభివృద్ధికి ఎకరాకు రూ.9 వేలు చొప్పున అందజేయాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంక్‌ల రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిహెచ్. దేముడు, డి.శంకర్, బి.నాగేశ్వరరావు, డి.దాసు, కె.సుదర్శన్, కె.రామస్వామి, ఇ. గోపాలుడు, పి.శ్రీరామ్, మామిడి దేముడు, గూట్ల దేముడు, చెదల ఎరకన్నదొర, పి.మహాలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment