దీపం గ్యాస్‌కు అదనంగా వసూలు చేస్తే చర్యలు
తుమ్మపాల: దీపం పథకం గ్యాస్ సిలిండర్ల పంపిణీ సమయంలో నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింటు కలెక్టర్ ఎం.జాహ్నవి గ్యాస్ ఏజెన్సీలను హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సివిల్ సప్లయ్ అధికారులు, గ్యాస్ కంపెనీల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందజేస్తున్న పథకాలపై ప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరిస్తుందన్నారు. అందులో భాగంగా దీపం పథకంపై ఐవీఆర్‌ఎస్ పద్ధతి ద్వారా సేకరించిన అభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలో డెలివరీ సిబ్బంది ప్రజల నుంచి గ్యాస్ సిలిండర్ ధర కంటే అధికంగా డబ్బులు వసూలు చేయకుండా సంబంధిత డీలర్లు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రతి ఫిర్యాదుకు రూ.5 వేల చొప్పున అపరాధ రుసుం విధిస్తామన్నారు. గ్యాస్ డెలివరీ సమయంలో తూనిక యంత్రంతో తూచి లబ్ధిదారునికి అందించాలన్నారు. అందుకు గాను తూనికల శాఖ నుంచి ఆమోదం పొందిన కాటాలను వినియోగించాలన్నారు. ప్రజల ఫిర్యాదులపై విచారణ జరిపి సకాలంలో నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కె.వి.ఎల్.ఎన్.మూర్తి, తూనికలు కొలతల శాఖ సహాయ కంట్రోలర్ బి.రామచంద్రరావు, గ్యాస్ కంపెనీల డీలర్లు, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment