ఆశ.. నిరాశ
కూటమి పాలనలో
● బడ్జెట్‌లో ప్రకటించిన మూడు అంశాలూ కంటితుడుపునకే.. ● మండిపడుతున్నఆశా కార్యకర్తలు ● డిమాండ్ల సాధనకు నేడు ‘చలో విజయవాడ’
వేతనాల పెంపుపై మాట తప్పిన ప్రభుత్వం ● అనేక సమస్యలకు దొరకని పరిష్కారం
సాక్షి, అనకాపల్లి: తీవ్రమైన పని ఒత్తిడి.. చాలీచాలని జీతాలు.. పెరిగిన నిత్యావసర ధరలు.. దీంతో బతుకు భారమై భవిష్యత్తు అగమ్యగోచరమై ఆశా కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. కరోనా లాంటి విపత్కర సమయాల్లో కూడా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న కనీస డిమాండ్‌కూ ఈ కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపించిందని వారు మండిపడుతున్నారు. అందుకే ఈ నెల 6వ తేదీన తలపెట్టిన ‘చలో విజయవాడ’కు బయల్దేరారు. జిల్లాలోని వైద్యాధికారులందరికీ వినతిపత్రాలు సమర్పించి, ఫలితం లేకపోవడంతో చివరకు ఉద్యమించడానికి సిద్ధపడ్డారు. ఆశ వర్కర్లకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలేవీ అందడం లేదని, తక్షణమే వాటిని అమలుచేయాలని, వేతనాలు పెంచాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆశా వర్కర్స్ యూనియన్‌కు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ప్రసూతి సెలవులు, 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి ఉద్యోగ విరమణ ప్రోత్సాహంతో సరిపెట్టింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించి.. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్‌ని ఆశావర్కర్లుగా మార్పు చేయాలని, ప్రభుత్వ సెలవులు, క్యాజువల్ లీవ్స్, బీమా సౌకర్యం, మట్టి ఖర్చులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేసిన వారికి పదోన్నతి కల్పించాలన్న కనీసమైన డిమాండ్‌నూ ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటిపై ఆశా వర్కర్స్ యూనియన్‌తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వాటిని అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. 2024 ఫిబ్రవరి 9వ తేదీన ఇచ్చిన ఒప్పంద మినిట్స్ కాపీలకు జీవోలు ఇచ్చి అమలు చేయాలని కోరుతూ గురువారం చలో విజయవాడకు పిలుపునిచ్చారు. జిల్లాలో 1445 మంది ఆశాలు తమ నిరసన తెలియజేయడానికి విజయవాడకు పయనమయ్యారు.
ఆశ.. నిరాశ
Comments
Please login to add a commentAdd a comment