ఉపమాక కల్యాణోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత
● నాలుగువైపులా చెక్‌పోస్టులు ● ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ● అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ● ఆలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారుల సమీక్ష
నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వరస్వామివారి వార్షిక కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నెల 10న స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. 9వ తేదీన ఇందుకు అంకురార్పణ చేస్తారు. ఐదు రోజులపాటు స్వామివారి కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ వారు ఏర్పాట్లు ప్రారంభించారు. కల్యాణోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. నక్కపల్లి సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ సన్నిబాబు, దేవస్థానం మాజీ చైర్మన్లు కొండబాబు, బుజ్జి, మండల టీడీపీ అధ్యక్షుడు కె.వెంకటేష్, ప్రధానార్చకులు జి.వరప్రసాదాచార్యులు బుధవారం దేవస్థానంలో సమావేశమయ్యారు. కల్యాణోత్సవాల సందర్బంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై చర్చించారు. నాలుగు చక్రాల వాహనాలను నిర్దేశించిన చోటనే పార్క్ చేయాలి. ద్విచక్రవాహనాలను 10వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే ఆలయం వద్దకు అనుమతిస్తారు. పదో తేదీ సాయంత్రం నుంచి పదకొండో తేదీ ఉదయం వరకు కేవలం నడచి వెళ్లే భక్తులను మాత్రమే అనుమతిస్తారు. రూ.కోట్లాది విలువైన స్వామివారి ఆభరణాలను విశాఖ ట్రెజరీ నుంచి తీసుకురానుండడంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ కుమారస్వామి తెలిపారు. ఆలయం వద్ద పోలీస్ ఔట్‌పోస్టు, ఆలయానికి చేరుకునే నాలుగు మార్గాల్లో పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు 200 మందికి పైగా పోలీసు సిబ్బంది గస్తీ కాస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment