ఉపమాక కల్యాణోత్సవాలకు పటిష్ట బందోబస్తు
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 9 నుంచి 17 వరకు జరిగే వార్షిక కల్యాణోత్సవాలకు 300మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. శుక్రవారం ఆయన ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయ పరిసరాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. వారం రోజుల పాటు జరిగే కల్యాణోత్సవాలకు సుమారు లక్షమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గొలుసు దొంగతనాలు, జేబు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈవ్ టీజింగ్‌ను నియంత్రించాలన్నారు. కల్యాణోత్సవ పరిసరాలు, మెయిన్ రోడ్డు, మాడ వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మానిటరింగ్ కోసం తాత్కాలిక కంట్రోలు రూం ఏర్పాటు చేయా లని ఆదేశించారు. భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ కోసం డ్రోన్ కెమెరాలు ఉపయోగించాలని సూచించారు. అపరిచిత వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. రథోత్సవం నాడు రోప్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్‌బీ డీఎస్పీ అప్పారావు, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు కుమారస్వామి, రామకృష్ణ, ఎస్‌ఐ సన్నిబాబు, ఐటీ కోర్ ఎస్‌ఐ సురేష్‌బాబు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు
శనివారం జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించారు. నక్కపల్లి డిగ్రీ కళాశాల ఆవరణలో మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరవుతారన్నారు.
ఆలయానికి చేరిన ఆభరణాలు
నక్కపల్లి: ఉపమాకలో ఈనెల 10వ తేదీన జరిగే వెంకన్న కల్యాణోత్సవాల సందర్భంగా స్వామివారికి అలంకరించేందుకు శుక్రవారం సబ్ ట్రెజరీ నుంచి ఆభరణాలను తీసుకువచ్చారు. స్వామివారికి వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, కెంపులు, కోట్లాది రూపాయల విలువైన పచ్చలహారం, చింతాకు పతకం, కాసుల పేర్లు, వజ్ర వైఢూర్యాలు పొదిగిన కిరీటం, కటి, హస్తాలు మొదలయిన స్వర్ణాభరణాలు ఉన్నాయి. భద్రతా కారణాల రీత్యా వీటిని విశాఖలో పటిష్ట బందోబస్తు మధ్య సబ్ ట్రెజరీలో భద్రపరుస్తున్నారు. కల్యాణోత్సవాలకు వీటిని తీసుకువచ్చి స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. కల్యాణం అనంతరం వీటిని తిరిగి విశాఖ సబ్ ట్రెజరీకి తరలిస్తారు. శుక్రవారం చేరుకున్న ఆభరణాలను ఆలయం వద్ద ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తదితరులు స్వాధీనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీటిని శనివారం నుంచి స్వామికి అలంకరిస్తారు. ఆభరణాలను ఆలయంలో ఉంచిన నేపథ్యంలో ప్రత్యేక పోలీసు సిబ్బంది, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు సిబ్బందితో ఆలయం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
డ్రోన్ సాయంతో పర్యవేక్షణ :
ఎస్పీ తుహిన్ సిన్హా
ఉపమాక కల్యాణోత్సవాలకు పటిష్ట బందోబస్తు
Comments
Please login to add a commentAdd a comment