‘ఉపాధి’ లక్ష్యాలను సాధించాలి
● ప్రజా వేదికలో డ్వామా పీడీ పూర్ణిమాదేవి
● నిధుల రికవరీకి ఆదేశాలు
నర్సీపట్నం: ప్రతి జాబ్‌కార్డుదారుకు వంద రోజులు ఉపాధి పని దినాలు కల్పించాలని డ్వామా పీడీ పూర్ణిమాదేవి ఆదేశించారు. ఏడాది కాలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై శుక్రవారం స్థానిక ఉపాధి హామీ కార్యాలయం వద్ద జరిగిన ప్రజావేదికలో ఆమె పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో సోషల్ ఆడిట్ బృందం గుర్తించిన లోపాలను ప్రజావేదికలో వెల్లడించారు. మొక్కలు వేసినట్లు రికార్డుల్లో చూపుతున్నా, క్షేత్రస్థాయిలో అవి లేవని, పనికి వెళ్లకుండా కొందరు పేరున మస్తర్లు వేసినట్లు పీడీ దృష్టికి తీసుకువెళ్లారు. గబ్బాడ ఫీల్డ్ అసిస్టెంట్ సన్యాసినాయుడు నిత్యం మద్యం మత్తులో ఉంటున్నాడని, పని కల్పించటం లేదని కూలీలు ఫిర్యాదు చేశారన్నారు. అతడిని తొలగించాలని ఎంపీడీవో ఉషాశ్రీని పీడీ ఆదేశించారు. ఏడాది కాలంలో రూ.12 కోట్లతో పనులు చేపట్టగా, రూ.లక్ష వరకు దుర్వినియోగం జరిగినట్లు సోషల్ ఆడిట్ బృందం గుర్తించింది. సంబంధిత వ్యక్తులను రూ.60 వేల వరకు రికవరీకి పీడీ ఎంపీడీవోను ఆదేశించారు. అనంతరం రోలుగుంట, నాతవరం, కోటవురట్ల, మాకవరపాలెం మండలాల్లోని ఎఫ్‌ఎఎస్, టీఎఎస్, ఈఎస్, ఏపీవోలతో సమీక్షించారు. 37,56,173 పని దినాలకు గాను 35,23,727 పని దినాలు పూర్తి చేశారని, మిగిలిన 2,32,446 పని దినాలను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి అమృత్ సర్వోవర్, రోడ్డుకు ఇరువైపులా రెండు కిలో మీటర్ల మేర మొక్కలు పెంపకం, 20 ఎకరాలు భూ అభివృద్ధి పనులు, ప్రతి రైతుకు మామిడి, కొబ్బరి, జీడి మొక్కలు పంపిణీ చేయాలన్నారు. చెరువు గట్లపై కొబ్బరి మొక్కలు నాటాలన్నారు. జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ నిర్మలాదేవి, స్టేట్ రిసోర్స్ పర్సన్ నాగరాజు, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, ఎంపీటీసీ బోళెం చినబాబు, టీడీపీ మండలాధ్యక్షుడు శ్రీరంగస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment