ఆందోళనకరంగా మెదడు, నాడీ వ్యవస్థ రుగ్మతలు
● అంతర్జాతీయ న్యూరో సర్జరీ వైద్య నిపుణుడు, ప్రొఫెసర్ మళ్ల భాస్కరరావు
అనకాపల్లి టౌన్ : మెదడు, నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే రుగ్మతల నియంత్రణకు ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ న్యూరో సర్జరీ వైద్య నిపుణులు, నిమ్‌హేన్స్ బెంగళూరు ఆస్పత్రి పూర్వ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ మళ్ల భాస్కరరావు సూచించారు. స్థానిక గౌరీ గ్రంథాలయం 83వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఇక్కడ న్యూరో వ్యాధి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు మెదడు, నాడీ సంబంంధ వ్యాధులతో అంతర్గతంగా బాధపడుతున్నారని అధ్యయనంలో తేలిందన్నారు. దేశ జనాభాలో 2019 నాటికి 37.9 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్ నియోనాటల్ ఎన్సెఫలోపతి (మెదడు గాయం), మైగ్రేన్, చిత్తవైకల్యం, డయాబెటిక్ న్యూరోపతి (నరాల నష్ట), మెనింజైటిస్, మూర్చ, ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మత, నాడీ వ్యవస్థ క్యాన్సర్లు, అకాల జననం నుంచి వచ్చే నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఈ శాతం 2024 నాటికి మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం 40 నుంచి 58 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పురుషులు ఈ వ్యాధి బారిన పడుతున్నారన్నారు. గౌరీ గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ, కన్వీనర్ మళ్ల బాపునాయుడు, అధ్యక్షుడు కాండ్రేగుల జగ్గారావు, కాండ్రేగుల సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment