రోడ్డున పడిన 400 మంది కార్మికులు
● వేతనాలు వేస్తామని నమ్మబలికి
అందుబాటులో లేని లలిత ఫెర్రో యాజమాన్యం
● ఆందోళన చేపట్టిన కార్మికులు
అచ్యుతాపురం రూరల్ : వేతనాలు అకౌంట్లలో వేస్తామని కార్మికులను నమ్మబలికి వారిని రోడ్డున పడేసిన రాజ్ రాజేశ్వరి లలిత త్రిపుర సుందరి ఫెర్రో పరిశ్రమ యాజమాన్యంపై కార్మికులు మండిపడుతున్నారు. సోమవారం నాటికి తమ అకౌంట్లలో వేతనాలు వేస్తామని చెప్పి తరువాత ఫోన్‌లు ఎత్తకుండా మోసం చేయడంపై కార్మికులు ఆందోళనకు దిగారు. వారికి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము అండగా నిలిచారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పరిశ్రమ లాక్ అవుట్ చేసి కార్మికులను రోడ్డున పడేయడం అన్యాయమన్నారు. ఉపాధి పేరున వేల కోట్ల రాయితీలు పొందుతూ రూ. కోట్ల విలువైన భూములను తీసుకుని పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని చెప్పి నిర్వాసితులకు మోసగించారన్నారు. కార్మికులకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చకుండా దొంగచాటున పరిశ్రమలో ఉన్న ఉత్పత్తి మెటీరియల్‌ని తరలించడంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదివరకు కార్మికులకు హామీ ఇచ్చిన పరిశ్రమల ప్రతినిధులను సైతం యాజమాన్యం విధుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో కార్మికులు పరిశ్రమ గేటు బయట ఆందోళన చేపట్టారు. సుమారు 400 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. క్యాంటీన్‌లో పనిచేస్తున్న ఆరుగురు కార్మికుకులు ఆరు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. వారికి వేతనాలతో పాటు గ్రాట్యూటీ ఇచ్చి ఆదుకోవాలన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్మికులను నిర్ధాక్ష్యణ్యంగా విధుల నుంచి తొలగించిన పరిశ్రమ యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
రోడ్డున పడిన 400 మంది కార్మికులు
Comments
Please login to add a commentAdd a comment