కనుల పండువగా వెంకన్న కల్యాణోత్సవాలు
ఉభయ దేవేరులతో కల్యాణ కాంతులీనుతున్న ఉపమాక వెంకన్న
కనుల పండువగా ఎదురు సన్నాహ మహోత్సవం
భక్తులే పెళ్లి పెద్దలయ్యారు. శ్రీవారికి, దేవేరులకు నేత్రపర్వంగా కల్యాణోత్సవాలు జరిపిస్తున్నారు. అర్చక స్వాముల ఇంట స్వామివారిని, ఉభయనాంచారులను ఎదురెదురుగా ఉంచి భక్తులు జరిపిన పెళ్లిమాటలు, కట్నకానుకల కార్యక్రమం (కన్యావరుణ సంవాదం) ఆద్యంతం ముగ్ధులను చేసింది.
నక్కపల్లి: ఉపమాక క్షేత్రంలో కలియుగ వైకుంఠనాథుని తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో వెలసిన మూలవిరాట్‌కు పంచామృతాలతో అభిషేకం, తొలిపూజ నిర్వహించారు. స్వర్ణాభరణాలతో అలంకరించిన శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామిని పెద్దపల్లకిలో వేంచేయింపజేసి ఉపమాక మాడ వీధుల్లో తిరువీధి సేవ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్, అర్చక స్వాములు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. ధ్వజపటాన్ని ఎగురవేస్తూ అష్టదిక్పాలకులు, దేవతలను స్వామివారి కల్యాణానికి ఆ హ్వానించడం జరిగిందని, ధ్వజారోహణతో కల్యాణోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయినట్లేనని అర్చక స్వాములు తెలిపారు. విశాఖ నుంచి తెచ్చి న ఆభరణాలను స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరించి ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న అద్దాల మండపంలో ఉంచి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 9 గంటలనుంచి భక్తుల రాక ఒక్కసారిగా పెరిగిపోవడంతో కిలోమీటరు దూరం క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
నేత్రపర్వంగా ఎదురు సన్నాహమహోత్సవం
కల్యాణ తంతులో భాగంగా సోమవారం రాత్రి ఎదురు సన్నాహ మహోత్సవం జరిగింది. దీనినే కన్యావాద సంవాదం (పెళ్లిమాటల తంతు) అంటారు. వేంకటేశ్వరస్వామిని ఇత్తడి గరుడ వాహనంపైన, ఉభయదేవేరులను ఇత్తడి సప్పరం వాహనంపై ఉంచి చిన్నవీధి, పెద్ద వీధులలో ఊరేగించారు. ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటి వద్ద పెళ్లిమాటల తంతు నిర్వహించారు. విశ్రాంత తెలుగు పండిట్ డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి స్వామివారి, అమ్మవార్ల గుణగణాలను, కీర్తిప్రతిష్టలను వివరించిన సన్నివేశం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీవేంకటేశ్వరస్వామిరిని రథంపై ఉంచి తిరువీధుల్లో రథోత్సవం నిర్వహించారు. హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయ కృష్ణన్, డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ తుహిన్ సిన్హా స్వామిని దర్శించుకున్నారు.
వడ్డాదిలో పోటెత్తిన భక్తులు
బుచ్చెయ్యపేట: వడ్డాది వేంకటేశ్వరస్వామి 152వ కల్యాణ మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల కల్యాణ వేడుకల్లో భాగంగా ఏకదశి తొలిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, తిరువీధి ఉత్సవం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయం ముందు భక్తులు బారులు తీరారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు కుటుంబ సభ్యులకు తొలి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు చేయించి స్వామివారి ప్రసాదాలు అందించారు. భక్తుల గోవింద నామస్మరణతో గిరిజాంబ కొండ మార్మోగింది. కోటాటాలు, చిడతల భజనల మధ్య సాయంత్రం స్వామివారికి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. స్వామి పల్లకిని మోయడానికి పలువురు భక్తులు పోటీపడ్డారు. రాత్రికి గిరిజాంబ కొండపైన ఆలయ కల్యాణ మండపంలో స్వామి వారి కల్యాణాన్ని వేలాదిమంది భక్తుల సమక్షంలో వేడుకగా నిర్వహించారు. దేవస్ధానం ఈవో శర్మ దగ్గరుండి పూజా కార్యక్రమాలు చేయించి ప్రసాదాలు అందించారు. రాత్రికి ఆలయం వద్ద వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్‌లో వర్తక సంఘం ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని అలరించాయి.
కనుల పండువగా వెంకన్న కల్యాణోత్సవాలు
కనుల పండువగా వెంకన్న కల్యాణోత్సవాలు
కనుల పండువగా వెంకన్న కల్యాణోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment