అభివృద్ధి మాది...డప్పు మీది...?
● వై.ఎస్ జగన్ హయాంలోనే మైదాన, గిరిజన ప్రాంతాలకు రోడ్లు ● నాటి నిధులతో పనులు చేపడుతూ నేడు కొత్తగా మంజూరైనట్టు కూటమి నేతలు చెప్పడం సరికాదు ● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు
దేవరాపల్లి: మాడుగుల నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో మైదాన, గిరిజన అవాస ప్రాంతాలకు సైతం రోడ్డు సౌకర్యం కల్పిన ఘనత తమకే దక్కుతుందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు గవరవరం నుంచి ఎ.కోడూరు వరకు నిర్మించిన తారురోడ్డును ఆయన బుధవారం పరిశీలించారు. గవరవరం–ఎ.కోడూరు రోడ్డుకు రూ. 2 కోట్లు, ఘాట్‌రోడ్డు–కింతలి రోడ్డుకు రూ. 9 కోట్లు నిధులను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి ఒకే ప్రొసీడింగ్‌లో మంజూరు చేయించానన్నారు. అప్పట్లో వర్షాకాలం, ఆ తర్వాత ఎన్నికల రావడంతో ప్రభుత్వం మారిందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము మంజూరు చేసిన నిధులతో పనులు చేపడుతుందని, అయితే ఈ నిధులు కొత్తగా మంజూరు చేసినట్టు చెప్పుకోవడం సరికాదని హితవు పలికారు. గవరవరం–కాశీపురం రోడ్డు విస్తరణకు సైతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే రూ. 20 కోట్లు మంజూరు చేసి 90 శాతం మేర కల్వర్టు పనులు సైతం పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. చింతలపూడి పంచాయతీ శివారు దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలు, గెడ్డల మధ్య ఉన్న బోడిగరువు, నేరెళ్లపూడి గిరి గ్రామాలకు స్వాతంత్య్రం వచ్చాక ఏ రాజకీయ నాయుకుడు వెళ్లలేదన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో సుమారు 5 కిలోమీటర్ల మేర కాలినడకన చేరుకొని వారి కష్టాలను స్వయంగా చూశానన్నారు. ఆయా గ్రామాలకు 25 అడుగుల వెడల్పున మట్టి రోడ్డు, కల్వర్టులు పూర్తి చేసి కారులో వెళ్లానని గుర్తు చేశారు. ఈ రోడ్డును రెండు వర్కులుగా విభజించి మట్టి రోడ్డుతో పాటు తారు రోడ్డు నిర్మాణానికి సైతం రూ. 3.50 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారు పనులు చేపట్టడం శుభ పరిణామమేనని, అయితే ఆ నిధులు కొత్తగా మంజూరు చేసినట్టు ప్రచారం చేసుకొని మళ్లీ శంకుస్థాపన చేయడం విడ్డూరమని అన్నారు. ఈ వర్కులకు సంబంధించిన ప్రొసీడింగ్ సైతం తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. తాను నాడు మంత్రి హోదాలో చేసిన అభివృద్ధిని చూస్తే సంతోషం కలుగుతుందన్నారు. ఆయన వెంట ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు, ఎ. కొత్తపల్లి సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment