తియ్యని మాటలు... చెరిగిన బాసలు
● కూటమి పాలకుల నిర్లక్ష్యం..‘గోవాడ’కు శాపం ● నిధులు తెస్తామని ముఖం చాటేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు ● ఒక్క రూపాయి కూడా సాయం చేయని కూటమి ప్రభుత్వం ● ఫ్యాక్టరీ మనుగడపై చెరకు రైతులు, కార్మికుల్లో ఆందోళన ● నేడు రైతు సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా
●చక్కెర ఫ్యాక్టరీ చేదైందా..!
చోడవరం :
గోవాడ సుగర్ ప్యాక్టరీ మనుగడపై రైతులు, కార్మికుల్లో ఆందోళన నెలకొంది. సాయం చేస్తుందనుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా సాయం చేయకపోగా ఫ్యాక్టరీని అభివృద్ధి చేసేస్తామని చెప్పిన కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులు ఫ్యాక్టరీ చుట్టుపక్కలకే కనిపించకుండా పోయారు. ఇంతటి దయనీయ పరిస్థితుల మధ్య మేము ఈ చెరకు పంట వేయలేమంటూ తన పొలంలో సొంతంగా వేసుకున్న చెరకు పంటనే దేవరాపల్లి మండలంలో ఒక రైతు తోటకు నిప్పంటించుకుని తన నిస్సహాయతను వ్యక్తం చేసిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. ఈ పరిిస్థితుల్లో ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు, ప్రభుత్వ నిరంకుశ పాలనను ఎత్తిచూపేందుకు రైతు సంఘాలు ఆందోళన బాట పట్టాయి. దీనిలో భాగంగా ఈనెల 21వ తేదీన శుక్రవారం ఫ్యాక్టరీ వద్ద మహాధర్నాకు రైతన్నలకు పిలుపు నిచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి ఈ ఏడాది క్రషింగ్ సీజన్‌లో ఎదురవుతున్న సమస్యలు మరింతగా కుంగదీస్తున్నాయి. మరో పక్క ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, నాయకులు చేతులెత్తేయడంతో ఇప్పుడు ఫ్యాక్టరీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతులకు చెరకు పేమెంట్స్ ఇవ్వలేక, కార్మికులకు జీతభత్యాలు చెల్లించలేక, పాత బకాయిలు చెల్లించలేక, క్రషింగ్‌కు కావలసిన సామాగ్రికి అవసరమైన ఆర్థిక స్థోమత లేక ఫ్యాక్టరీ చాలా దయనీయంగా ఉంది. 23, 450 మంది సభ్యరైతులు ఉన్న ఈ ఫ్యాక్టరీ నేడో రేపో మూసివేసే దుస్థితికి రావడం రైతులను, కార్మికులను ఆందోళనకు గురిచేస్తుంది. 2019 సంవత్సరానికి ముందు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫ్యాక్టరీ పాలకమండలిలో ఉన్న టీడీపీ పాలకవర్గం సుమారు రూ. 150 కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టింది. అప్పట్లో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి ఆర్థిక సాయం అందించలేదు. దీంతో ఫ్యాక్టరీ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఫ్యాక్టరీని ఆదుకుంది. ప్రభుత్వ విప్ హోదాలో అప్పటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఉపముఖ్యమంత్రిగా బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమల శాఖామంత్రిగా గుడివాడ అమర్‌నాఽథ్ ఈ ఫ్యాక్టరీని కాపాడటానికి ఎంతో కృషిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి ఐదేళ్లలో రూ. 89 కోట్లు ఆర్థిక సాయం అందించారు. ఎక్కడా అప్పుతేకుండా ఉత్పత్తి అయిన పంచదార, ఇతర ఉత్పత్తులు అమ్మకాలతో వచ్చిన డబ్బులతో రైతులకు పేమెంట్స్ ఇచ్చి కొత్త అప్పులు లేకుండా గడిచిన ఐదేళ్లలో ఫ్యాక్టరీని నడిపారు. దీంతో పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన గోవాడ ప్యాక్టరీ నెమ్మదిగా అప్పుల ఊబిలోంచి కొంతమేర బయటపడింది. అయితే 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీకి మళ్లీ గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి.
గత ప్రభుత్వం ఎనలేని ‘సహకారం’
రాష్ట్ర సహకార రంగంలో 11 సుగర్ ఫ్యాక్టరీల్లో అన్నీ ఇప్పటికే మూతబడి పోగా ఒక్క గోవాడ ఫ్యాక్టరీ మాత్రమే నడుస్తోంది. ఈ ఫ్యాక్టరీకి కనీసం రూ.9 కోట్లు సాయం అందించి, ఫ్యాక్టరీని, రైతులను ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోలేకపోవడంపై చెరకు రైతులు ఆగ్రహంతో ఉన్నారు. గత జగన్ ప్రభుత్వ పాలనలో 4 ఫ్యాక్టరీలకు సుమారు రూ.200 కోట్లు వరకూ ఆర్థికసాయం అందించి, కార్మికులు, రైతుల పాతబకాయిలన్నీ చెల్లించారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ విషయంలో అయినా ఎందుకు స్పందించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు...ఫ్యాక్టరీ మనుగడ కోసం, ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులంతా ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.
‘మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆర్థికంగా ఆదుకుంటాం.. ఉప ఉత్పత్తుల యూనిట్లు నెలకొల్పి ఫ్యాక్టరీని ఆధునికీకరిస్తాం...చెరకు టన్నుకి రూ.4 వేలు గిట్టుబాటు ధర కల్పిస్తాం...’ అంటూ ఎన్నికల నాడు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కె.ఎస్.ఎన్‌ఎ.స్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో మీటింగ్‌లు పెట్టి మరీ చెప్పారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన సాయం కంటే ఒక రూపాయి అయినా ఎక్కువ తెస్తామని గత సెప్టెంబర్‌లో జరిగిన ఫ్యాక్టరీ మహాజనసభలో ప్రకటించారు. హామీలు కోటలు దాటాయి...కానీ...చేతలు ఫ్యాక్టరీ గేటు కూడా దాటలేదు. గడిచిన పదినెలల్లో కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి సాయం అందివ్వలేదు.
నేడు చెరకు రైతుల మహాధర్నా:
ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకోవాలని కోరుతూ రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన చెరకు రైతులు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏపీ చెరకు రైతు సంఘం, ఏపీ రైతుసంఘం, ఏపీ రైతు కూలీ సంఘం, ఏపీ వ్యవసాయ రైతు కూలీసంఘం, సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టనున్నారు. ఈ ఆందోళనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పాల్గొననున్నారు. ఇప్పటికే తమ ప్రచార బృందాలతో ఆటోలతో ఫ్యాక్టరీ పరిధిలో ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం కూడా చేశారు.
ఫ్యాక్టరీ
గోడు
పట్టదా?..
ఇప్పుడు జనవరి నెలలో ఫ్యాక్టరీ క్రషింగ్ సీజన్ ప్రారంభమైంది. ఎప్పుడో 1962లో 1000 టన్నుల కెపాసిటీతో స్థాపించిన ఈ ఫ్యాక్టరీ దశలవారీగా కెపాసిటీ స్థాయి పెంచుకుంటూ ప్రస్తుతం 5.2లక్షల టన్నుల క్రషింగ్ కెపాసిటీకి వచ్చింది. కానీ మిషనరీ అంతా 30, 40యేళ్ల కిందటిది కావడంతో పాత మిషనరీతో తరచూ క్రషింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓవర్‌హాలింగ్ సమయంలో అవసరమైన కొత్తమిషనరీ పార్టులు తెచ్చి బిగించే వారు. ఈ ఏడాది నిధులు లేక నామమాత్రంగా ఉన్నంతలో ఓవర్‌హాలింగ్ పూర్తి చేసి క్రషింగ్‌కు దిగారు. దీంతో క్రషింగ్‌లో పాత మిషనరీ పరికరాలు ఒక్కొక్కటిగా మరమ్మతులకు గురై తరుచూ అంతరాయం కలుగుతోంది. రైతులు తెచ్చిన చెరకు కాటాల వద్ద ఎండిపోయి బరువు తగ్గిపోయి రైతులకు టన్నేజీ తగ్గిపోయి నష్టం కలుతుతోంది. అత్యవసరంలో రూ. 9 కోట్లు ప్రభుత్వం సాయంగా అందిస్తే తప్ప తాత్కాలికంగా ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చెరకు రైతులంతా కూటమి నేతల వంచనపై ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.
తియ్యని మాటలు... చెరిగిన బాసలు
తియ్యని మాటలు... చెరిగిన బాసలు
తియ్యని మాటలు... చెరిగిన బాసలు
Comments
Please login to add a commentAdd a comment