
కార్పొరేట్ గాలం
పదో తరగతి పరీక్షలు ముగియక ముందే కార్పొరేట్ విద్యాసంస్థల దందా మొదలైంది. హలో..సార్ మీ అమ్మాయి పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తుందని తెలుసుకున్నాం.. మా కళాశాలలో చేర్పించండి.. నాణ్యమైన బోధన ఉంటుంది..అంటూ తమ సిబ్బందితో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ చేసి వారిని అయోమయానికి గురి చేస్తున్నాయి. టెన్త్ వార్షిక పరీక్షలు పూర్తి కాకముందే పీఆర్ (పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్)లను రంగంలోకి దింపి విద్యార్థుల ఇళ్లకు పంపించి వారిని తమ కళాశాలల్లో ప్రవేశాలు తీసుకునేలా కార్యాచరణను గత మూడు నెలల నుంచే ముమ్మరం చేశాయి.
విద్యార్థులకు
● ప్రారంభమైన ఇంటర్ అడ్మిషన్ల దందా ● టెన్త్ విద్యార్థుల కోసం ప్రైవేటు కళాశాలల గాలం ● పది పరీక్షలు పూర్తి కాక ముందే తల్లిదండ్రులతో ఒప్పందాలు ● మెడికల్, ఇంజినీరింగ్ శిక్షణ ఇస్తామని ఎర ● నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియ ● ఉమ్మడి జిల్లాలో 63,735 మంది టెన్త్ విద్యార్థులు ● అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతల డిమాండ్
రూ.5వేలు నుంచి రూ.10 వేలు అడ్వాన్స్
కార్పొరేట్,పెద్ద ప్రైవేటు కళాశాలల్లో సీటు కావాలంటే కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోర్సు, శిక్షణను బట్టి రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వరకు
అడ్వాన్సుగా చెల్లించాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. విద్యార్థుల
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు సీటు దొరకదేమోనన్న
ఆతృత, ఫీజులో రాయితీ ఇస్తారన్న ఆశతో ముందుగానే సీటు బుక్ చేసుకుంటున్నారు. ఏసీ గదుల్లో తరగతులు, వసతి కావాలంటే
రూ.30 వేలు నుంచి రూ.50 వేలు
అడ్వాన్సుగా కట్టించుకుంటున్నారు.
ముందస్తు అడ్మిషన్లు చేసిన పీఆర్వోలకు, వారికి సహకరించిన కొన్ని పాఠశాలల
యాజమాన్యాలకు, ట్యూషన్ సెంటర్ల నిర్వాహకులు, కొంతమంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు విందులు, నజరానాలు సైతం ఇస్తుండడం
అడ్మిషన్ల దందా ఎలా కొనసాగుతోందో
తెలియజేస్తోంది.
యలమంచిలి రూరల్ : ఏఏ పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారో వారి సమాచారాన్ని ముందే సేకరించి కార్పొరేట్ కళా శాలలు అడ్మిషన్ల దందాకు తెర తీస్తు న్నాయి. ఆర్థిక స్థోమత బాగుండి, తమ కళాశాలలో చేరే అవకాశం ఉన్న వారికి గాలం వేస్తున్నారు. తమ కళాశాలల్లో చదివిన వారు డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌లు అయ్యారని ప్రచారం చేస్తున్నారు.
పీఆర్‌ల సందడి
జిల్లా, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో పీఆర్‌వోల సందడి కనిపిస్తోంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి తమ కార్పొరేట్ కళాశాలల గొప్పతనం, ఇతర వివరాలు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులతో పాటు మొదటి సంవత్సరం నుంచి ఇంజినీరింగ్, మెడిసన్, ఎయిమ్స్, ఐఐటీ జేఈఈ, గ్రూప్స్‌కు సంబంధించిన శిక్షణ ఇస్తామని చెబుతున్నారు. ఒక్కసారి మా కళాశాలలో మీ అబ్బాయి లేదా అమ్మాయిని చేర్పిస్తే ఇక భవిష్యత్తుకు ఢోకా ఉండదని నమ్మబలుకుతున్నారు. ముందుగా బుక్ చేసుకుంటే ఫీజు రాయితీ ఉంటుందని, పదో తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత ఫీజు పెరిగిపోతుందని, సీట్లు దొరుకుతాయో లేదో చెప్పలేమని తల్లిదండ్రులకు చెప్పి అడ్మిషన్లు చేయిస్తున్నారు. ముందుగా సీటు రిజర్వ్ చేసుకోకపోతే కోరిన బ్రాంచిలో సీటు దొరకదని తల్లిదండ్రులను బెదరగొడుతున్నారు. దీంతో కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల్లో పేరు మోసిన కార్పొరేట్ కాలేజీల్లో ముందస్తు అడ్మిషన్లు పొందుతున్నారు.
టెన్త్ పరీక్షలు కాక ముందే..
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యాయి. ఇంకా అవి పూర్తి కాకముందే కార్పొరేట్ కళాశాలలు ముందస్తు బుకింగ్‌లకు తెరతీశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63,735 మంది పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరవుతున్నారు. వాస్తవానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రతి ఏటా ప్రకటన విడుదల చేస్తుంది. ఆ ప్రకటనలో ప్రవేశాలకు సంబంధించి నిర్ణీత షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. దీని ప్రకారం ప్రవేశాల కోసం దరఖాస్తులు అమ్మకం దగ్గర్నుంచి ఎన్ని దశల్లో ప్రవేశాలు చేపట్టాలనే నియమ నిబంధనలన్నీ తెలియజేస్తారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన కళాశాలలన్నీ ఈ ప్రవేశ ప్రకటనను అనుసరించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఇవేమీ అమలు కావడంలేదు. కార్పొరేట్, బడా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలన్నీ గడచిన మూడు, నాలుగు నెలల నుంచే అడ్మిషన్ల వేట కొనసాగిస్తున్నారు. ముందస్తు అడ్మిషన్ల కోసం జోరుగా అడ్వాన్సులు కూడా కట్టించేసుకుంటున్నారు. ఈ ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధమంటూ ఇంటర్ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు మొదలు పట్టినట్టు తెలిసినా సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
త్వరపడొద్దు...
అయితే తల్లిదండ్రులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించే ముందు పిల్లల అభిప్రాయాలతో పాటు, సదరు కళాశాలల్లో వసతులు, విద్యా బోధన, అనుమతులకు సంబంధించి వీలైనంతగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. తమ వ్యాపారాభివృద్ధి, ర్యాంకుల కోసం నిత్యం విద్యార్థులను పుస్తకమే ప్రపంచంగా మార్చే కళాశాలలు కొన్ని ఉన్నాయని, వాటిలో చేర్పిస్తే విద్యార్థులు ఒత్తిడికి గురై మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
కార్పొరేట్, కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పీఆర్‌వోలను నియమించుకుని ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం అన్వేషిస్తున్నారు. ఆఫర్ల పేరుతో తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. ముందస్తు అడ్మిషన్లు చేయరాదని ప్రభుత్వ నిబంధనలున్నా వాటిని బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా అడ్మిషన్ల దందా కొనసాగిస్తున్నారు. అధికారులు నిబంధనలను పాటించని కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలి. – మామిడి రమణ,
ఎస్‌ఎఫ్‌ఐ, జిల్లా ప్రధాన కార్యదర్శి
నిబంధనలకు విరుద్ధం
నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకూడదు. ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రవేశాల ప్రకటన జారీ చేసిన తర్వాతే ఆ షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు చేపట్టాలి. ఎలాంటి ముందస్తు అడ్మిషన్లు చేయకూడదు. ముందస్తు అడ్మిషన్లపై విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి సమాచారం మాదృష్టికి తీసుకురావాలి. నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలలపై చర్యలు తీసుకుంటాం.
– బి సుజాత, జిల్లా ఇంటర్ విద్యాధికారి

కార్పొరేట్ గాలం

కార్పొరేట్ గాలం