అనంతపురం: రేస్ అంటే బైక్, కారు మాత్రమే కాదు.. సైక్లింగ్ చేయడం కూడా సాహసమే.. కొందరు సైకిల్ తొక్కడం సరదాగా నేర్చుకుంటే.. మరికొందరు సాహసం చేయడానికి వెనుకాడడంలేదు. అందులో గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన నిహారిక సాహసోపేత సైక్లింగ్ చేస్తూ పర్వతాలపైకి కూడా దూసుకెళ్తోంది. చిన్నతనం నుంచి ఆమెకు సైక్లింగ్‌పై ఆసక్తి ఉంది.. తల్లిదండ్రులు కూడా ఆమెను నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించి, శిక్షణ ఇప్పించారు. ఆ స్ఫూర్తితో ముంబాయిలో సరదాగా సైక్లింగ్ నేర్చుకుని, దగ్రేట్ హిమాలయన్ అల్ట్రా రేస్‌ను పూర్తి చేసింది.
2020లో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించి, కన్నవారితోపాటు తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటుతోంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన భాస్కర్‌రెడ్డి, వాణి రెడ్డి దంపతులు 2005లో ముంబాయిలో వ్యాపారం చేయడానికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వీరికి నిహారిక రెడ్డి, లలిత్ సంతానం. కుమార్తె నిహారిక రెడ్డి చిన్నతనం నుంచి సైక్లింగ్‌పై ఆసక్తి పెంచుకోవడంతో తల్లిదండ్రులు కూడా ఆమె ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. దీంతో సైక్లింగ్ రేస్ అంటే సాహసోపేతమైనా అందులో తర్ఫీదు పొందింది.
నిహారిక రెడ్డి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ముంబాయిలోనే చదివింది. ప్రస్తుతం అక్కడే ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (ఎంపీసీ) చదువుతోంది. చిన్నతనంలో ఎలాంటి అనుభవం లేక పోయినా దాదాపు 700 కిలో మీటర్లు సైక్లింగ్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటగా 2020లో అండర్ – 15 లో ముంబాయి – హైదరాబాద్ 656 కిలో మీటర్లు సైక్లింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది.
ఆర్‌ఏఎంకు అర్హత..
నిహారికరెడ్డి 2022లో అండర్– 16 పుణె టు గోవా సైక్లింగ్ రేస్‌లో పాల్గొని, 652 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేసింది. కోచ్ కబీర్ డెక్కన్, హిమాలయన్, రేస్‌లు పూర్తి చేసి ఆర్‌ఏఎంకు అర్హత సాధించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ కబీర్ స్ఫూర్తితో ఆమె రోజూ 50 కిలో మీటర్లు సైక్లింగ్ చేస్తూ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ వస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 26,27 తేదీల్లో ఇన్‌స్పైర్ ఇండియా నిర్వహించిన భారత్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక రేస్ దగ్రేట్ హిమాలయన్ అల్ట్రా రేస్‌లో పాల్గొని, లేహ్ నుంచి ద్రాస్ వరకు మళ్లీ ద్రాస్ నుంచి లేహ్ వరకు మధ్యలో కార్గిల్ వరకు 600 కిలో మీటర్లు 36 గంటల్లో రేస్ పూర్తి చేయాలని లక్ష్యంతో పాల్గొంది. సముద్ర మట్టానికి 10,350 మీటర్లు ఎత్తు లో ఈ రేస్‌ను 39 గంటల్లో పూర్తి చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆర్‌ఏఎం చేయడం లక్ష్యం
ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక రేస్ అక్రాస్ అమెరికా (ఆర్‌ఏఎం) అల్ట్రా రేస్‌కు అర్హత సాధించి, స్వప్నం సాకారం చేసుకోవడమే లక్ష్యం. అందుకోసం రోజూ ఉదయం 5 గంటల నుంచి 7 వరకు దాదాపు 50 కిలో మీటర్లు సైక్లింగ్ చేస్తా. ఆదివారం దాదాపు 100 నుంచి 120 కిలో మీటర్లు సైక్లింగ్ చేస్తా. ఆర్‌ఏఎం రేసులో అమెరికా వెస్ట్ కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ వరకు సుమారు 4,500 కిలో మీటర్లు దూరం ఉంటుంది. ఈ రేసులో పాల్గొనాలంటే డెక్కన్, హిమాలయన్ రేస్‌లు పూర్తి చేయాలి.
– నిహారిక, సైక్లిస్ట్
Comments
Please login to add a commentAdd a comment