
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: జిల్లాలో తక్కువ కాలం పని చేసినా.. తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని, ఇది మరువలేనిదని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ వెస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయిన ఆయనకు బుధవారం పోలీసు పరేడ్ మైదానంలో ఏఆర్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పోలీసు క్వార్టర్సులో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలు, సిబ్బంది చూపించిన ప్రేమాభిమానాలను మరువలేనన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తాను పని చేసినా ఎక్కడా ఇంతటి సంతృప్తికరమైన విధులను చూడలేదన్నారు.
నేరాలను ఛేదించే క్రమంలో పనిని సవాళుగా తీసుకోవడం, టీమ్ వర్క్ చేయడం లాంటి అనేక అంశాల్లో సిబ్బంది చూపిన ఆత్మస్థైర్యం స్ఫూర్తిదాయకమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచాలన్నారు. అనంత వాసుల్లో మానవత్వం ఎక్కువగా ఉందన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ రోడ్డు ప్రమాద సమయంలో అనిత ఆరోగ్యంపై అనంత వాసులు స్పందించిన తీరును కొనియాడారు. కష్టం ఎవరికి వచ్చినా కరిగిపోయి ఆపన్న హస్తాలందించే వ్యక్తిత్వం అనంత వాసుల సొంతమన్నారు. మంచి వాతావరణంలో పని చేశానన్నా సంతృఫ్తితో వెళుతున్నానన్నారు.
కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఆయన కుటుంబసభ్యులు, సెబ్ అదనపు ఎస్పీ జి.రామకృష్ణ, డీఎస్పీలు శ్రీనివాసులు, గంగయ్య, నర్శింగప్ప, శివారెడ్డి, మునిరాజ్, జి. ప్రసాద్‌రెడ్డి, సీఐలు జాకీర్ హుస్సేన్, ఇందిర, విశ్వనాథచౌదరి, దేవానంద్, రెడ్డప్ప, శివరాముడు, ధరణీకిషోర్, ప్రతాప్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, నాగార్జునరెడ్డి, ఆర్‌ఐలు హరికృష్ణ, రాముడు, లీగల్ అడ్వైజర్ విష్ణువర్థన్‌రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment