అనంతపురం: సరిగ్గా వారం కిందట ఆ ఇంట పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పందిరి ఇంకా తీయనేలేదు. అంతలోనే విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ వెంకటరమణ, ఆయన అల్లుడు మృతిచెందగా..కుమార్తె తీవ్రంగా గాయపడడం కుటుంబ సభ్యులు, బంధువులను విషాదంలోకి నెట్టింది.
వారం రోజుల క్రితం వివాహం
అనంతపురం నగరానికి చెందిన నంబూరి వెంకటరమణ (55) పోలీసు శాఖలో 1989 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా విధుల్లోకి చేరారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. అంచెలంచెలుగా ఎదిగి మూడేళ్ల క్రితం పదోన్నతిపై కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎస్‌ఐగా వెళ్లారు. అక్కడి నుంచి ఇటీవల ప్యాపిలి సర్కిల్ పరిధిలోని రాచర్ల ఎస్‌ఐగా బదిలీ అయ్యారు. గత బుధ, గురు వారాల్లో తన ఒక్కగానొక్క కుమార్తె అనూషకు హైదరాబాద్‌కు చెందిన పవన్ సాయితో అనంతపురంలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.
అనంతరం కుటుంబసభ్యులు, బంధువులతో కలసి హైదరాబాద్‌కు వెళ్లారు. బుధవారం కారులో హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద 44వ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐ వెంకటరమణతో పాటు అల్లుడు పవన్ సాయి (25), డ్రైవర్ చంద్ర (27) అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తె అనూష తీవ్రంగా గాయపడింది. వెంకటరమణ సతీమణి వాణి మరో కారులో ప్రయాణిస్తుండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
కళ్ల ముందే భర్త, తండ్రి మృతి
అనూష కళ్ల ముందే తండ్రి వెంకటరమణ, భర్త పవన్‌సాయి దుర్మరణం చెందడంతో ఆమె షాక్‌కు గురైంది. విగత జీవులుగా మారిన తండ్రి, భర్తను చూసి వెనుక కారులో వస్తున్న తల్లికి సమాచారం అందించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
పెళ్లి ఇంట తీవ్ర విషాదం
పెళ్లి అయి బంధువులు ఇంకా ఇంటికి చేరుకోకముందే మరణవార్త వినాల్సి వచ్చింది. భర్త, అల్లుడు మృతి చెందడం, కూతురు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలవడంతో వెంకటరమణ భార్య వాణిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. ఎంత పనిచేశావు దేవుడా అంటూ గట్టిగా ఏడ్వడం చూసి పలువురు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎస్‌ఐ వెంకటరమణ అన్నదమ్ములు ముగ్గురు కాగా, గతంలో ఇద్దరు అకాల మరణం చెందారు. దీంతో మూడు కుటుంబాలకు వెంకట రమణే పెద్ద దిక్కుగా ఉండేవారు. ఇప్పుడు ఆయన కూడా అకాల మరణం చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment