తాడిపత్రిలో విధ్వంసకాండ
తాడిపత్రి టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాడిపత్రిలో విధ్వంసకాండ ఆగడం లేదు. తాజాగా గుర్తుతెలియని వ్యక్తులు చిన్నపోలమడ గ్రామ సమీపంలో ఉన్న ఆర్టీఓ కార్యాలయ భవనంలోకి చొరబడి భవన సామగ్రి, శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చొరవతో దాదాపు రూ.కోటి వెచ్చించి దాతల సహకారంతో భవనం నిర్మించారు. కార్యాలయం నిర్మాణంలో ఉండగానే ఆర్టీఓ అధికారులు వాహనాల ఎఫ్‌సీలు వంటి విధులు నిర్వర్తించేవారు. కార్యాలయ ప్రారంభాన్ని అడ్డుకునేందుకు తాడిపత్రి టీడీపీ నాయకులు విశ్వయత్నాలు చేశారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో తాడిపత్రి మోటర్‌వెహికల్ ఇన్‌స్పెక్టర్లతో కలిసి అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులు కార్యాలయం వైపు చూడటం మానేశారు. దీంతో భవనం కాస్త నిరుపయోగంగా మారింది.
సామగ్రి ధ్వంసం..
బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంలోకి చొరబడి కనబడిన వాటినల్లా ధ్వంసం చేశారు. భవనం ప్రారంభ శిలాఫలకాలు, తలుపులు, గాజు వాకిలి, విద్యుత్ బోర్డ్‌లు పగులగొట్టారు. అయితే ఇది గంజాయి మూకల పనా.. లేక గత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను జీర్ణించుకోలేని అధికార పార్టీ నాయకుల పనా అంటూ పట్టణంలో చర్చ సాగుతోంది. ఈ విషయమై మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులును వివరణ కోరగా గత ప్రభుత్వంలో అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదేశాలతో భవనం ప్రారంభోత్సవం అయితే జరిగిందని, ఆ భవనంలో విధులు నిర్వహించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపినా పైనుంచి అనుమతులు రాలేదన్నారు. ప్రస్తుతం భవనం తమ పర్యవేక్షణలో లేదని, ధ్వంసం విషయం తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment