
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కుమారుని వివాహానికి సీఎం హాజరయ్యారు. తిరిగి వెళ్లే సమయంలో అక్కడ ఎడమ కన్ను, చెవి అంగవైకల్యం.. మలి్టపుల్ డిజబిలిటీతో బాధపడుతున్న రెండున్నర ఏళ్ల నారాయణ నిఖిల్‌ను ముఖ్యమంత్రి పరామర్శించారు.
నగరంలోని భవానిపురం, 38 వార్డు కొత్తపేటలో నివాసం ఉంటున్న బైపిళ్ళ రమేష్, లక్ష్మీ పద్మ దంపతుల కుమారుడు నారాయణ నిఖిల్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని మాజీమంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వివరించారు. వారి సమస్యను విన్న జగన్.. చిన్నారికి వైద్య సేవలు నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావును ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే ఢిల్లీరావు వైద్య సేవల నిమిత్తం రూ.లక్ష చెక్కును కలెక్టరేట్‌లో అందజేశారు.