పల్లెకు 104 పరుగులు | 104 Ambulance Services Starts in Visakhapatnam From Today | Sakshi
Sakshi News home page

పల్లెకు 104 పరుగులు

Aug 14 2020 12:32 PM | Updated on Aug 14 2020 12:32 PM

104 Ambulance Services Starts in Visakhapatnam From Today - Sakshi

 పాడేరు: పల్లె సంజీవనిగా మహానేత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన 104 వాహనాల సేవలను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మరింత విస్తృతం చేశారు. జిల్లాలోని 42 మండలాలకు 104 వాహనాలను అన్ని సౌకర్యాలతో అందుబాటులో తెచ్చారు. గత నెల 1న రాష్ట్ర వ్యాప్తంగా కొత్త 104 వాహనాల సేవలను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు విశాఖ జిల్లాకు కూడా ఈ వాహనాలు చేరుకున్నాయి. అయితే కోవిడ్‌–19 కారణంగా వీటి సేవలను తాత్కాలికంగా జిల్లా అధికారులు వాయిదా వేశారు. 42 మండలాలకు 42 కొత్త వాహనాలు చేరుకున్నాయి. ఆయా వాహనాలను మండలాల్లోని పీహెచ్‌సీల వద్ద భద్రంగా ఉంచారు. 104 సేవలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో శుక్రవారం నుంచి ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.  

ప్రతి వాహనంలో వైద్యుడు  
అన్ని సౌకర్యాలతో కూడిన నూతన 104 వాహనాల్లో వైద్యుడిని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వైద్యుడితో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్‌ ఉంటారు. 104 వాహనం వెళ్లే గ్రామాల వివరాలను ముందుగానే తెలియజేస్తారు. గ్రామ సచివాలయాల్లో ఆరోగ్య కార్యకర్తలు, సబ్‌ సెంటర్‌లో ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలను కూడా 104 వాహన సేవలకు అనుసంధానం చేశారు. వైద్య పరీక్షల సమయంలో వారి సేవలను కూడా ప్రభుత్వం తప్పనిసరి చేసింది.  

ప్రజలకు అందే సేవలు  
వైద్య సేవలకు దూరంగా ఉన్న గ్రామాల్లోని ప్రజలు ఆస్పత్రికి వెళ్లే పనిలేకుండా రోగుల చెంతకే 104 ద్వారా వైద్య సేవలు అందనున్నాయి.  
ఈ కొత్త వాహనాల్లో ఆక్సిజన్‌ సౌకర్యాన్ని కూడా అందుబాటులో తెచ్చారు.   
వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విలువైన మందులు రోగులకు పంపిణీ చేస్తారు. ఈ మేరకు 52 రకాల మందులను కూడా 104 వాహనాల్లో సిద్ధం చేశారు.  
బీపీ, సుగర్‌ వ్యాధిగ్రస్తులకు కూడా అవసరమైన చికిత్స అందించనున్నారు. గ్రా మాల్లోని గర్భిణులకు కూడా ప్రతినెల వైద్య పరీక్షలు జరపుతారు.  
ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు  104 ద్వారా వైద్యులు, సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉంటారు.  
నీటి కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు నీటి శుద్ధికి కూడా చర్యలు తీసుకుంటారు. 

సత్వర వైద్యం  
కొయ్యూరు, జీకే వీధి మండలాలు మినహా 104 సేవలను జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నాం. మండలాల్లోని ప్రధాన పీహెచ్‌సీల వద్ద నుంచి గ్రామాలకు వాహనాలను పంపి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను కల్పిస్తాం.  వీటి సేవలను  సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాలను సందర్శించే వివరాలను కూడా ముందుగానే ఆయా వైద్య బృందాల ద్వారా గ్రామాల్లో ప్రచా రం చేస్తాం.  – జి.మహేశ్వరరావు, 104 సేవల జిల్లా ఆపరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement