1,600 మంది ఎంపీహెచ్‌ఏల తొలగింపు | 1600 MPHAs dismissed | Sakshi
Sakshi News home page

1,600 మంది ఎంపీహెచ్‌ఏల తొలగింపు

Published Fri, Dec 6 2024 5:14 AM | Last Updated on Fri, Dec 6 2024 5:14 AM

1600 MPHAs dismissed

కోర్టు ఉత్తర్వుల మేరకు అని పేర్కొన్న ప్రజారోగ్య శాఖ

3 నెలల ముందస్తు నోటీస్‌ ఇచ్చి, 3 నెలల జీతం ఇచ్చిన తర్వాతే తొలగించాలన్న కోర్టు 

ఇవేమీ చేయకుండా హడావుడిగా తొలగించిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: వైద్య శాఖలో 22 ఏళ్ల వరకూ మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఎంపీహెచ్‌ఏ) మేల్స్‌గా సేవలు అందించిన ఉద్యోగుల కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. దీంతో తమ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొందరు దాదాపు ఉద్యోగ విరమణ దశలో..మరికొందరు ఉద్యోగులు ఉన్నారు. 2013లో మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించిన 1207 జీవో ద్వారా ఎంపికైన 1,000 మందిని, అనంతర కాలంలో ఈ జీవోను అనుసరించి మరో 500–600 మందిని ప్రభుత్వం నియమించింది. 

వీరిని విధుల నుంచి తొలగించాలని జిల్లాల డీఎంహెచ్‌వోలను ఆదేశిస్తూ గురువారం ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మావతి ఉత్తర్వులిచ్చారు. డీఎంహెచ్‌వోలు సైతం తొలగింపు ఉత్తర్వులను సదరు ఉద్యోగులకు పంపారు. తెలంగాణ హైకోర్టు తీర్పు మేరకు వీరిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు వైద్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2002లో ఎంపీహెచ్‌ఏల నియామకంలో అర్హతలపై సుప్రీం, హైకోర్టుల్లో కేసులు పడ్డాయి.

కోర్టు ఉత్తర్వుల మేరకు ఉమ్మడి ఏపీలో 1,200 మందిని తొలగించాల్సి ఉండగా వీరిని 2013లో మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం మేరకు జోవో 1207 కింద తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.  ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ 1200 మందిలో దాదాపుగా 250 మంది వరకు తెలంగాణకు వెళ్లిపోవాలి. మిగిలిన వారితో (సుమారు 1,000 మంది) కలిపి 2013లో విధుల్లోకి తీసుకున్న దాదాపు 600 మంది కలిపి మొత్తం 1600 మందిని తాజాగా విధుల నుంచి తొలగించారు. వీరందరూ 45–50 ఏళ్లు పైబడిన వాళ్లే. 

దశాబ్దాల పాటు సేవలు అందించిన తమను మానవతాదృక్పథంతో ప్రభుత్వం విధుల్లో కొనసాగించాలని వీరు కోరుతున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయడానికి 3 నెలల సమయం ఉందని, వారం కూడా తిరగకుండా హడావుడిగా ప్రభుత్వం విధుల నుంచి తొలగించడంపై మండిపడుతున్నారు.

హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి ఆస్కారం ఉందని, ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. 2,3 రోజుల్లో కోర్టు మెమోల ద్వారా 2021–24 సంవత్సరాల్లో విధుల్లో చేరిన మరో 1,500 మందిని కూడా విధుల నుంచి తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 

ప్రభుత్వం పునరాలోచించాలి
ఎంపీహెచ్‌ఏల తొలగింపు విషయాన్ని ప్రభుత్వం పునరా>లోచించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.ఆస్కార్‌ రావు కోరారు. కోర్టు తీర్పు ప్రకారం 3 నెలల ముందస్తు నోటీస్‌ ఇచ్చి, 3 నెలల జీతం ఇచ్చిన తర్వాతే తొలగించాలన్నారు. కనీస నియమాలు పాటించకుండా ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. కొందరు ఉద్యోగులు రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement