సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఈ వైరస్ నియంత్రణకు ఇచ్చే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు తీవ్ర కొరత ఏర్పడింది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏప్రిల్ 10 నాటికి 84 వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రోజుకు 3 వేల నుంచి 4 వేల ఇంజక్షన్లు వినియోగం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరో 20 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు రేట్లు తగ్గడంవల్ల తిరిగి టెండర్లు వేసి మళ్లీ ఆర్డరు ఇవ్వనున్నామన్నారు.
4 లక్షల హోం ఐసొలేషన్ కిట్‌లు అందుబాటులో..
ఇక రాష్ట్రంలో ఆస్పత్రులకు వచ్చి చికిత్స పొందే కరోనా బాధితుల కోసం కాకుండా ఇంట్లోనే (హోం ఐసొలేషన్) చికిత్స పొందే వారికి 4 లక్షల కిట్‌లు అందుబాటులో ఉంచారు. ఇందులో పారాసెటిమాల్ మొదలుకొని అజిత్రోమైసిన్ వరకూ కరోనా నియంత్రణకు మందులుంటాయి. వీటిని కూడా అవసరమున్న మేరకు అందుబాటులో ఉంచారు. ఇవికాక.. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో పారాసెటిమాల్, అజిత్రోమైసిన్ మందులు అందుబాటులో ఉంచారు.
దేశవ్యాప్తంగా గ్లౌజుల కొరత
ఇదిలా ఉంటే.. ఏపీలోనే కాక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలనూ గ్లౌజుల కొరత వేధిస్తోంది. రబ్బరు ధరలు పెరగడం, ముడిసరుకు ఇతర దేశాల నుంచి రావాల్సి ఉండటంతో దేశంలో చిన్నచిన్న యూనిట్లు చాలా మూతపడ్డాయి. దీంతో సకాలంలో గ్లౌజులు రావడంలేదు. రాష్ట్రంలో మరికొద్దిరోజులకు సరిపడా గ్లౌజులు ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
పటిష్టంగా పీహెచ్‌సీలు, ‘104’ వ్యవస్థ
కరోనా నియంత్రణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) పనితీరును కూడా ప్రభుత్వం పునఃసమీక్షించనుంది. దీనిపై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పీహెచ్‌సీలోని వైద్యులు, 104లోని వైద్యుడు తన పరిధిలో విధిగా వైద్యసేవలు అందించాలన్నారు. అలాగే, ప్రతీ పీహెచ్‌సీకి అవసరమైన 104 అంబులెన్స్‌లు ఉన్నాయో లేదో పరిశీలించి అవసరమైతే సమకూర్చుకోవాలని కూడా సూచించారు. అంతేకాక.. కోవిడ్ బాధితులు ఆసుపత్రుల్లో బెడ్ కోసం 104 కాల్‌సెంటర్‌ను సంప్రదిస్తే గతంలో ఎలా సమకూర్చామో, ఇప్పుడూ అలాగే చర్యలు తీసుకోవాలని.. అధికార యంత్రాంగం మొత్తం ఆ ఒక్క ఫోన్‌కాల్‌కు స్పందించాలన్నారు. అలాగే, 104 నంబర్‌పై మళ్లీ విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా.. కరోనా నియంత్రణలో భాగంగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాలని.. మాస్క్ పెట్టుకోని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. జిల్లాల్లో కోవిడ్ ఆసుపత్రులను హేతుబద్ధంగా నిర్వహించాలన్నారు.
రాష్ట్రంలో 84 వేల రెమ్‌డెసివిర్‌లు రెడీగా..
Published Sun, Apr 11 2021 3:13 AM | Last Updated on Sun, Apr 11 2021 3:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment