9 New National Highways To Rayalaseema - Sakshi
Sakshi News home page

National Highways: రాయలసీమకు కొత్తగా 9 జాతీయ రహదారులు

Nov 25 2022 4:05 AM | Updated on Nov 25 2022 11:41 AM

9 new national highways to Rayalaseema - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరిన్ని జాతీయ రహదారుల అభివృద్ధికి ముందడుగు పడింది. రాష్ట్రంలో కొత్తగా 9 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. వీటికి ఏకంగా రూ.9,009 కోట్లు కేటాయించింది. మొత్తం 411 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ రహదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదించింది. రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారులను ప్రతిపాదించింది. 

పొడవైన తీరప్రాంతం ఉన్న రాష్ట్రాన్ని పోర్టు ఆధారిత పరిశ్రమలతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గతంలో రెండుసార్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమై జాతీయ రహదారులపై ప్రతిపాదనలను సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం వాటిని ఆమోదించింది. తొలి దశలో గత ఏడాది కేంద్ర మంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రూ.15 వేల కోట్లతో నిర్మించనున్న జాతీయ రహదారులకు విజయవాడలో భూమి పూజ చేశారు.

రెండో దశ కింద రాయలసీమలో జాతీయ రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ మేరకు కొత్తగా 9 రహదారులతో పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వీటికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ నెల 28న తిరుపతిలో భూమిపూజ చేయనున్నారు. ఇప్పటికే రూ.204 కోట్లతో 19 కిలోమీటర్ల మేర నిర్మించిన రెండు జాతీయ రహదారులను ఆయన ప్రారంభిస్తారు.

కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటన ఇలా... 
కేంద్ర మంత్రి గడ్కరీ ఈ నెల 27, 28 తేదీల్లో తిరుపతిలో పర్యటిస్తారు. ఆయన 27వ తేదీ రాత్రికి తిరుమల చేరుకుని తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. అనంతరం 28న తిరుపతిలో నిర్వహించే కార్యక్రమంలో, జాతీయ రహదారుల భూమిపూజలో పాల్గొంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement