AP Budget 2021: ఇది అందరి బడ్జెట్‌ | AP Budget 2021: Budget Introduced In Legislative Assembly on Thursday | Sakshi
Sakshi News home page

AP Budget 2021: ఇది అందరి బడ్జెట్‌

Published Thu, May 20 2021 2:52 AM | Last Updated on Thu, May 20 2021 8:20 AM

Andhra Pradesh budget 2021–22 will be introduced in Legislative Assembly on Thursday - Sakshi

2020 – 21 సామాజిక ఆర్థిక సర్వేను విడుదల చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రణాళిక శాఖ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి విజయ్‌కుమార్‌

సాక్షి, అమరావతి: తొలిసారిగా మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ... అందుకు తగ్గట్టే కేటాయింపులు చేసిన జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ముందుకు రాబోతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021–22 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఈ బడ్జెట్‌ ఆమోదం కోసం రాష్ట్ర ఉభయ  సభలనూ ఒకరోజు ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి మూడు నెలలకు గాను రూ.70,983 కోట్ల మేర ఓటాన్‌ అకౌంట్‌కు గతంలోనే కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో ఇపుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పించబోతున్నారు. నిజానికి గడిచిన రెండేళ్లుగా యావద్దేశ ఆర్థిక వ్యవస్థను కోవిడ్‌ కకావికలం చేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సైతం ఇబ్బందులు ఎదుర్కొంటుండగా... కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక వనరులు కూడా బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ కరోనా సంక్షోభ కాలంలో ప్రజల కష్టాలను తీర్చిడమే లక్ష్యంగా 2021–22 ఆర్థిక ఏడాది వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేశారని, మొత్తం బడ్జెట్‌ పరిమాణం రూ.2.25 లక్షల కోట్ల నుంచి 2.30 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్‌ ఇది. 

హామీలు నెరవేరుస్తూ కేటాయింపులు...
వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలో కూడా ఎన్నికల మేనిఫేస్టోలోని నవరత్నాల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడమే ప్రధాన లక్ష్యంగా బడ్జెట్‌ కేటాయింపులు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టడమే కాకుండా భారీగా చేసిన అప్పుల ప్రభావం ఈ సంవత్సరం బడ్జెట్‌ మీదా కనిపిస్తోంది. గత సర్కారు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడంతో పాటు పాత బిల్లుల చెల్లింపులు కూడా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతించిన మేరకు అప్పులు చేసైనా సరే అన్ని వర్గాల ప్రజలను కరోనా కష్టాల్లోంచి గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి జగన్‌ ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌ రూపకల్పనకు మార్గనిర్దేశం చేశారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, జల వనరులు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం.. తదితర అంశాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ.18,000 కోట్లు 
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద సామాజిక పెన్షన్‌ను వచ్చే జనవరి నుంచి రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచనున్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.18,000 కోట్లు కేటాయింపులు చేయనున్నారు. తొలిసారిగా జెండర్‌ బడ్జెట్‌ స్పృహతో.. అక్క చెల్లెమ్మలకు, 18 సంవత్సరాల్లోపు పిల్లలకు ఎంత ఖర్చు చేయనున్నారనే వివరాలను ప్రత్యేకంగా బడ్జెట్‌లో స్పష్టం చేయనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు ఈ బడ్జెట్‌లో ఉప ప్రణాళికలను ప్రవేశ పెట్టనున్నారు. మరో పక్క వృథా దుబారా, ఆర్బాటపు వ్యయాలకు చెక్‌ పెడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు కేటాయింపులను బడ్జెట్‌లో ప్రతిపాదించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఈ ఆర్థిక సంవత్సరం అమలు చేయనున్న నవరత్నాల్లోని పథకాలను ఏ నెలలో అమలు చేయనున్నామనే వివరాలతో క్యాలెండర్‌ ప్రకటించారు. ఇందుకు నిధుల లోటు రాకుండా బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. 

‘ఈబీసీ నేస్తం’కు కేటాయింపులు
ఈ బడ్జెట్‌లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఈబీసీ మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకానికి కేటాయింపులు చేయనున్నారు. కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలకు గత రెండేళ్లలో ఎంత ఆర్థిక సాయం అందించిందనే వివరాలతో పాటు ఈ బడ్జెట్‌లో ఎంత మేర ఆర్థిక సాయం చేయనున్నారో స్పష్టం చేయనున్నారు. సామాజిక పెట్టుబడిగా భావిస్తున్న వైద్య ఆరోగ్య రంగం, విద్యా రంగంలో నాడు–నేడు కార్యక్రమాల ద్వారా కల్పించే మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల కోసం కల్పించే మౌలిక సదుపాయాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి బడ్జెట్‌ బయట నుంచి నిధులు సమీకరణ చేయడం వల్ల ఆ మేరకు కేటాయింపులు బడ్జెట్‌లో ప్రతిబింబించవని, అయినా ఆ రంగాలకు భారీగా నిధులు వ్యయం చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

వ్యవసాయానికి పెద్దపీట
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ అనుంబంధ రంగాలన్నింటికీ కలిపి ఈ బడ్జెట్‌లో 29 వేల కోట్ల రూపాయల నుంచి 30 వేల కోట్ల రూపాయల కేటయింపులు ఉండవచ్చునని అధికార వర్గాల సమాచారం. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ సబ్సిడీతో పాటు రైతు భరోసాతో పాటు మల్టీపర్పస్‌ కేంద్రాల ఏర్పాటు, మార్కెటింగ్, ధరల స్థిరీకరణ నిధి, తదితర రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నారు. ఈ రంగానికి బడ్జెట్‌ బయట నుంచి కూడా నిధుల సమీకరణ చేయనున్నారు. ఆర్థికంగా రాష్ట్ర ఖజానా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి సుదీర్ఘ కసరత్తు అనంతరం మొత్తం రూ.2.25 లక్షల కోట్ల నుంచి రూ.2.30 లక్షల కోట్లతో 2021–22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.


వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గవర్నర్‌ ప్రసంగం
కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో గురువారం ఉదయం 9 గంటలకు గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌ రాజభవన్‌ నుంచి అసెంబ్లీ, మండలి సభ్యులనుద్ధేశించి వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పిన తర్వాత సభ ఆమోదించనుంది. అనంతరం 2021–22 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీకి సమర్పిస్తారు. ఇదే సమయంలో శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ ప్రసంగాన్ని చదువుతారు. అనంతరం అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను చదువుతారు. ఇదే సమయంలో శాసన మండలిలో రహదారుల–భవనాల శాఖ (డిప్యుటీ సీఎం) మంత్రి ధర్మాన కృష్ణ దాసు వ్యవసాయ బడ్జెట్‌ సమర్పిస్తారు. ఆ తర్వాత ఉభయ సభల్లో శాఖల పద్దులు ప్రవేశపెట్టి, ఆమోదం పొందుతారు. చివరగా ద్రవ్య వినమయ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాక సమావేశాలు నిరవధికంగా వాయిదా పడనున్నాయి. అంతకు ముందు గురువారం ఉదయం 8 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement