
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం 3.48 కోట్ల మంది కోవిడ్ వ్యాక్సిన్‌కు అర్హులుగా ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో అత్యధికంగా 18–45 సంవత్సరాల వయస్సు వారే 2.04 కోట్ల మంది ఉన్నారు. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వారు 20.82 శాతం మేర, 31 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వారు 17.37 శాతం మంది కోవిడ్ బారిన పడుతున్నట్లు ఇటీవల తేలింది.
ఈ నేపథ్యంలోనే ఆ వయసుల వారికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తద్వారా వేగంగా కోవిడ్ కట్టడి చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతించినందున అప్పటికల్లా అవసరమైన టీకా డోస్‌లు తెప్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో అన్ని కేటగిరీలకు సంబంధించి మొదటి, రెండో విడత కలిపి 56 లక్షల మందికి పైగా టీకా వేశారు.