ఏపీ.. ఆ నాలుగేళ్లలో హ్యాపీ | Achieving sustainable and inclusive growth in agriculture allied sectors | Sakshi
Sakshi News home page

ఏపీ.. ఆ నాలుగేళ్లలో హ్యాపీ

Published Fri, Aug 9 2024 5:16 AM | Last Updated on Fri, Aug 9 2024 5:16 AM

Achieving sustainable and inclusive growth in agriculture allied sectors

వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్థిరమైన, సమ్మిళిత వృద్ధి సాధన

చేపల ఉత్పత్తిలో నాలుగేళ్లుగా దేశంలోనే ఏపీ టాప్‌–1 

పశు సంపద ఉత్పత్తిలో నాలుగో స్థానం 

పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఐదో స్థానం 

స్థిర ధరల ఆధారంగా ఏటా పెరుగుతున్న ఉత్పత్తి విలువ 

వెల్లడించిన కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ–2024 నివేదిక

దేశానికి ఆహార ధాన్యాలను అందించడంలో గడచిన ఐదేళ్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసిన మన రాష్ట్రం వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ అదే ఒరవడి కొనసాగించింది. తద్వారా స్థిరమైన, సమ్మిళిత వృద్ధివైపు దూసుకెళ్లిందని వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ– 2024 నివేదిక స్పష్టం చేసింది.

వ్యవసాయ అనుబంధ రంగాలైన పండ్లు, కూరగాయలు, చేపలు, పశు సంపద ఉత్పత్తుల్లో గడచిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ అనుంబంధ రంగాల ఉత్పత్తుల పెరుగుదలపై ఆ శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది.

మత్స్య ఉత్పత్తుల్లో నంబర్‌–1 
2011–12 స్ధిర ధరల ఆధారంగా గడచిన నాలు­గేళ్లలో చేపల ఉత్పత్తులు, విలువ పెరుగుదలల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నంబర్‌–1 స్థానంలో నిలిచిందని ఆ నివేదిక స్పష్టం చేసింది. 2019­–­20 నుంచి 2022–23 వరకు నాలుగేళ్లలో చేపల ఉత్పత్తితో పాటు విలువ కూడా భారీగా పెరుగుతూ వచ్చిందని నివేదిక పేర్కొంది. 

2019–20 సంవత్సరంలో స్ధిర ధరల ఆధారంగా రూ.58,700 కోట్ల విలువ చేసే చేపల ఉత్పత్తి జరగ్గా.. 2022–­23­లో రూ.79,900 కోట్లకు పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. స్ధిర ధరల ఆధా­రంగా 2022–­23లో దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌లో చేపలు, ఆక్వా ఉత్పత్తుల వాటా 40.9 శాత­ంగా ఉందని నివేదిక వెల్లడించింది.

 ఆ తరువాత స్థానంలో పశ్చిమ బెంగాల్‌లో 14.4 శాతం ఉండగా, ఒడిశాలో 4.9 శాతం, బీహార్‌లో 4.5 శాత­ం, అస్సాంలో 4.1 శాతం ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో కలిపి 31.1 శాతం వాటా ఉందని వెల్లడించింది. 

పశు ఉత్పత్తిలోనూ టాప్‌ 
పశు సంపద అంటే పాలు, మాంసం, గుడ్లు ఉత్ప­త్తుల విలువ ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లుగా పెరుగుతూనే ఉందని నివేదిక వెల్లడించింది. 2019­–20లో స్ధిర ధరల ఆధారంగా పశు సంపద ఉత్పత్తుల విలువ రూ.54,200 కోట్లు ఉండగా.. 2022–­23లో రూ.64,000 కోట్లకు పెరిగింది. తద్వా­రా దేశంలో ఏపీ దిగువ నుంచి నాలుగో స్థానానికి ఎగబాకిందని స్పష్టం చేసింది. 

స్థిర ధరల ఆధారంగా 2022–23లో దేశవ్యాప్తంగా చూస్తే.. ఏపీలో పశు సంపద ఉత్పత్తుల వాటా 7.8 శాతంగా ఉంది. రాజ­స్థాన్‌లో 12.5 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 12.3 శాతం, తమిళనాడులో 9.1 శాతం, మహారాష్ట్రలో 7.3 శాతం వాటా ఉండగా.. మిగతా అన్ని రాష్ట్రా­ల్లో కలిపి 50.9 శాతం వాటా ఉందని నివేదిక పేర్కొంది.

ఉద్యాన పంటల్లోనూ.. 
పండ్లు, కూరగాయల ఉత్పత్తి విలువ పెరుగుదలలో గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ దేశంలో ఐదో స్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తుల విలువ స్దిర ధరల ఆధారంగా ఏపీలో 2019–20లో రూ.35,500 కోట్లు ఉండగా.. 2022–23లో రూ.35,800 కోట్లకు పెరిగింది. 

స్థిర ధరల ఆధారంగా 2022–23లో దేశం మొత్తంలో ఏపీలో పండ్లు కూరగాయల ఉత్పత్తుల వాటా 8.2 శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది. పశ్చిమబెంగాల్లో 11.4 శాతం, మధ్యప్రదేశ్‌లో 10.9 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 10.5 శాతం, మహారాష్ట్రలో 8.9 శాతం వాటా ఉండగా.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కలిపి 49.2 శాతం వాటా ఉందని నివేదిక వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement