సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతున్న అలీ దంపతులు
సాక్షి, అమరావతి: రాజకీయాల్లో సహనం ఎంతో అవసరమని, అది కోల్పోయి మాట్లాడితే జనమే రాజకీయ నేతలపై తిరగబడతారని సినీనటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా)గా నియమితులైన అలీ చెప్పారు. ఆయన బుధవారం సతీసమేతంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ఆయన సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఆయన సాక్షితో మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న తన కుమార్తె వివాహానికి సీఎం జగన్‌ను ఆహ్వానించేందుకు వచ్చినట్లు చెప్పారు. ఫస్ట్ కార్డు సీఎంకి అందజేశానన్నారు. సీఎం జగన్ తనకు అద్భుత అవకాశం ఇచ్చారని, ఆయన ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని చెప్పారు. గతంలో రాఘవేంద్రరావు ఈ పదవిలో ఉన్నారని గుర్తుచేశారు. దీనికి అలీ అయితే కరెక్ట్ అని సీఎం తనని నియమించారన్నారు.
తన వల్ల సీఎం జగన్‌కు ఎంతపేరు తీసుకురావాలో అంతా తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. రాజకీయాల్లో సహనం ఉన్న వారు గొప్ప నేతలు అవుతారని చెప్పారు. సీఎం జగన్ అలా ఉండి ప్రజాసమస్యలపై తిరుగులేని పోరాటాలు చేయటం వల్లే, తిరుగులేని మెజార్టీ సాధించి, సీఎం పదవి అధిరోహించారన్నారు. పదవుల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకునే వారు సీఎం జగన్‌లా ఉండాలని చెప్పారు.
బూతులు తిట్టడమే రాజకీయం అనుకోవటం నేతలకు సరైంది కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని నేతలు గ్రహించాలని సూచించారు. గతంలో అలీ పాత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఇకముందు సీఎం జగన్ ఆదేశాలను శిరసావహించి ముందుకు కదులుతానని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మనిషి అని పేర్కొన్నారు. అన్నివర్గాల్లో పేదల కోసం, ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారని చెప్పారు.
ప్రజలు ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై లబ్ధిపొందారన్నారు. ప్రజలు పథకాలను ఆదరిస్తున్నారని చెప్పారు. ఈసారి 175కి 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రి జగన్ 2024లో తిరుగులేని మెజార్టీతో మళ్లీ సీఎంగా ఎన్నికవుతారని పేర్కొన్నారు. ఆ క్రతువులో తనవంతు పాత్ర పోషిస్తానన్నారు. ఇక నుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా మరో అలీని చూస్తారని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment